ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. తమ సమస్యలు విన్నవించడానికి వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. ఆదిలాబాద్‌లో కలెక్టర్ రాజర్షి షాకు 74,నిర్మల్ కలెక్టర్‌కు పదుల సంఖ్యలో వినతులు వచ్చాయి. ఇందులో అధికంగా విద్య, వ్యవసాయం, ఐకేపీ మహిళా సంఘాల్లో డబ్బులు కాజేత, పీవీటీజీలకు ఇండ్ల బిల్లుల మంజూరు, ఇతర సమస్యలపై దరఖాస్తుదారులు అర్జీలు అందజేశారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్లు సమస్యలు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. కొన్ని పరిష్కారం అవుతుండగా.. చాలా వరకు పెండింగ్‌లోనే ఉంటున్నాయి.
– ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు 11
మద్యం దుకాణాన్ని వేరేచోటుకు తరలించాలి
నిర్మల్ జిల్లాలోని సిర్గాపూర్‌లో ప్లెయిర్ పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఉందని, ఆ దుకాణం వేరేచోటుకు తరలించాలని పాఠశాలకు చెందిన విద్యార్థులు, గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. మద్యం దుకాణం నిర్వహించడం వల్ల బహిరంగ ప్రదేశంలో ఇబ్బందులు కలుగుతున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు.
భర్త మృతదేహం ఇండియాకు వచ్చేలా చూడాలి..
నిర్మల్ జిల్లాలోని మున్యాల్ పెద్దూరుకు చెందిన సంగ సురేశ్ జీవనోపాధి కొరకు ఉబ్జెకిస్తాన్ వెళ్లాడు. అక్కడ గుండెపోటుతో జూలై 21వ తేదీన మృతి చెందాడు. ఇప్పటివరకు ఇండియాకు మృతదేహం రాలేదు. తన భర్త మృతదేహం ఇండియాకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సురేష్ భార్య మమత సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ స్పందించి మృతదేహం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ మెంబర్ స్వదేశ్ పరికిపండ్లను కలిసి మృతదేహం త్వరగా వచ్చేలా చూడాలని, అలాగే ఏజంట్‌కు ఇచ్చిన రూపాయ లు ఇప్పించేలా చూడాలని వినతిపత్రం ఇచ్చారు.
– సంగ మమత, కుటుంబసభ్యులు
పీవీటీజీ ఇండ్ల బిల్లులు ఇవ్వడం లేదు
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని ఆర్లీ(టీ) గ్రామంలో పీవీటీజీ గిరిజనులకు ఉట్నూర్ ఐటీడీఏ నుంచి 19 ఇండ్లు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 లక్షలు మంజూరు చేశారు. డబ్బులు వస్తాయనే ఆశతో అప్పులు చేసి ఇండ్లను నిర్మించుకున్నాం. నిర్మాణం పూర్తయి ఏడాది గడిచినా బిల్లులు చెల్లించడం లేదు. ఐటీడీఏ ప్రజావాణిలో అధికా రులను కలిస్తే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి బిల్లులు మంజూరు కావాల్సి ఉందని అంటున్నారు. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి దరఖాస్తు అందజేశాం.
అంగన్వాడీ ఆయాలకు పదోన్నతి కల్పించాలి
అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న ఆయాలకు అంగన్ వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ.. ఆయాలకు పదోన్నతి కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తక్కువ వేతనంతో ఆయాలు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
లోన్ డబ్బులు కట్టినా సీసీలు చెల్లించలేదు
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్ మహాత్మా మహిళా సంఘంలో మేము సభ్యులుగా ఉన్నాం. ఉపాధి కోసం బ్యాంకులో శ్రీనిధి నుంచి రూ. ఒక లక్ష రుణం తీసుకున్నాం. కిస్తీల రూపంలో డబ్బులను తిరిగి చెల్లిస్తున్నాం. మొత్తం డబ్బులు చెల్లించినా ఐకేపీ సీసీలు ఈ పైసలు బ్యాంకులో జమ చేయలేదు. దీంతో బ్యాంకులో మా సంఘం తరఫున రూ.44,460 బాకీ ఉన్నట్లు చూపెడుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు తెలుపడానికి ప్రజావాణికి వచ్చాం.
నాలుగెకరాల్లోసోయా నష్టపోయా..
నేను వానకాలం సాగులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి వద్ద నుంచి ఐదు బ్యాగుల సోయా విత్తనాలను రూ.16 వేలకు కొనుగోలు చేశా. నాలుగెకరాల్లో ఈ విత్తనాలు వేసినా ఎక్కడా మొలకెత్తలేదు. ఈ విత్తనాలు వాడితే పంటను తామే అధిక ధర క్వింటాలుకు రూ.7 వేల చొప్పున కొనుగోలు చేస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. సోయా విత్తనాలు మొలకెత్తలేదని అధికారులకు ఫిర్యాదు చేస్తే పరిశీలించారు. తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విత్తనాలు వాడడంతో రూ.2.25 లక్షల ఎకరాల పంట నష్టపోయా.
– గోనేల నర్సింములు, రుయ్యాడి, తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా
డబుల్ బెడ్రూంలు ఇవ్వాలని ధర్నా
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల కొరకు పోరాటం చేసిన లబ్ధిదారులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని సీపీఐ(ఎంల్) న్యూడెమాక్రసీ పార్టీ, ఎంసీపీఐయూ బహుజన కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఖానాపూర్ వాసులు సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. అనర్హులను తొలగించి ఇండ్లు కేటాయించా లన్నారు. సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా ఇండ్లు ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, తోట రాధ, అల్లపు పద్మ, షేక్ గౌస్, సునీత, గీత, సురేశ్, సయ్యద్ జాఫర్ పాల్గొన్నారు.
-నిర్మల్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన నాయకులు, ఖానాపూర్ వాసులు
దివ్యాంగులకు పింఛన్లు పెంచాలి
దివ్యాంగులకు పింఛన్లను రూ.4016 నుంచి రూ.6016కు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అర్హులైన దివ్యాంగులకు స్కూటీలు, వీల్ చైర్లు, బ్యాటరీ సైకిళ్లు ఇప్పించాలని కోరారు. అర్హులైన దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
-నిర్మల్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దివ్యాంగులు