నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ( Gadiguda Mandal ) మారేగావ్ నుంచి కొలమ గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు( BT Road) కంకర తేలి అడుగు అడుగున గుంతల మయంగా మారింది. హీరాపూర్, పర్సవాడ, తోయాగూడా, కొలామ, బుద్ధ గూడా గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
రోడ్డుపై కంకర తేలి ఉండడంతో వాహనాలు మరమ్మతులకు గురి అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే ప్రయాణం నరకంగా ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకునే నాధుడే కరువయ్యారని వాపోతున్నారు. వాహనాలు జారిపడి ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.