మంచిర్యాల, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని బెటాలియన్ పోలీసులు డిమాండ్ చేశారు. ‘టీజీఎస్పీ హటావో.. ఏక్ పోలీస్ బనావో..” నినాదంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ైప్లె ఓవర్ బ్రిడ్జిపై గుడిపేట 13వ బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు శనివారం రాస్తారోకో చేశారు. ఒకే పోలీస్ వ్యవస్థ అమలు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపైనే భీష్మించుకొని కూర్చున్నారు. అంతకుముందు గుడిపేటలోని బెటాలియన్ మెయిన్ బిల్డింగ్ ఎదుట ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నిరసన తెలిపారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి వచ్చేందుకు సిద్ధమైన వారిని పోలీసులు అడ్డుకున్నారు.
బెటాలియన్ ముందు గేట్లు వేసి బయటికి రాకుండా చూశారు. అయినా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల పోలీసులు స్థానిక ఐబీ చౌరస్తాలో మోహరించారు. ఈ విషయం తెలుసుకొని బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు ప్లెఓవర్పైనే బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులతో ఏసీపీ ప్రకాశ్ చేరుకొని వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినకుండా 40 నిమిషాలు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ైప్లె ఓవర్‌కు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు మాట్లాడుతూ బెటాలియన్‌లో తమ చేత గడ్డి చెక్కించడం, కాలువలు తీయించడం, గోడలు కట్టించడం మొదలైన పనులు చేపిస్తున్నారంటూ వాపోయారు. కుటుంబాలకు దూరంగా నెలల తరబడి విధులు నిర్వహిస్తున్నామని, ఈ రోజు ఇక్కడ పని చేస్తే రేపు ఎక్కడ పని చేస్తామో తెలియని దుస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏక్ పోలీస్ అమలు చేయాలని, అప్పటి వరకు తమను సీపీకి అటాచ్ చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో కాసేపు హోరెత్తించారు. చిన్న పిల్లలతో సహా వచ్చిన కానిస్టేబుళ్ల భార్యలు ఎండను సైతం లెక్కచేయకుండా రాస్తారోకోలో కూర్చున్నారు. ఈ క్రమంలో ఏసీపీతో బెటాలియన్ కానిస్టేబుళ్లకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కాసేపటికి బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు ైప్లెఓవర్ నుంచి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ తీసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మినిమం ఐదేళ్ల పోస్టింగ్ ఇవ్వాలి
బెటాలియన్ కానిస్టేబుళ్లకు మినిమం ఐదేళ్లు ఒకే దగ్గర ట్రాన్స్ఫర్స్ లేకుండా పోస్టింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మూడు నెలలు ఇక్కడ పని చేస్తే, ఆ తరువాత మూడు నెలలు ఎక్కడ పని చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. నెలలో నాలుగైదు రోజులే ఇంటి వద్ద ఉంటున్నారు. మిగతా రోజులు వాళ్ల కోసం మేం ఎదురు చూస్తూ పడరాని అవస్థలు పడుతున్నాం. నిత్యం ట్రాన్స్ఫర్లతో కానిస్టేబుళ్ల పిల్లల చదువులు సైతం ఆగమైతున్నాయి. మాకు న్యాయం చేసేలా ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలి.
– రత్నం భువన, కానిస్టేబుల్ భార్య, గుడిపేట 13వ బెటాలియన్
నా భర్త కూలిపని చేసేందుకు కానిస్టేబులవ్వలేదు..
ప్రజలకు సేవ చేయడానికి నా భర్త కానిస్టేబుల్ ఉద్యోగం తెచ్చుకున్నారు. పెద్దసార్లకు కాఫీలు తెచ్చి ఇవ్వడానికో, కూలిపని చేయడానికో ఉద్యోగంలో చేరలేదు. మా పిల్లలను చూడడానికి కనీసం నెలకు ఒకసారైనా ఇంటికి రావడం లేదు. మాకు ఈ రికార్డు పర్మిషన్లు అలాంటివి ఏమీ వద్దు. మాకు ఏక్ పోలీస్ కావాలి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ఉన్నట్లు ఇక్కడ మా వాళ్లకు అవే రూల్స్ ఉండాలని కోరుతున్నాం.
– అన్నం కావ్య, కానిస్టేబుల్ భార్య, గుడిపేట 13వ బెటాలియన్