చింతలమానేపల్లి, మే 9 : ‘మా భూముల్లో ట్రెంచ్‌లు తవ్వితే ఊరుకోం’ అంటూ అటవీశాఖ అధికారులపై పోడు రైతులు కన్నెర్రజేశారు. శనివారం చింతలమానేపల్లి మండలంలోని కరెల్లి రేంజ్ పరిధిలో కర్జెల్లి బీట్ కంపార్ట్మెంట్ నం.185లో పోడు భూముల్లో రీట్రైవ్లో భాగంగా ప్రొక్లెయినర్‌తో ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్‌లు తవ్వుతుండగా రైతులు అడ్డుకున్నారు. ప్రొక్లెయిన్‌కు ఎదురుగా కూర్చొని పనులు నిలిపివేశారు. దీంతో పోడు రైతులు, ఫారెస్ట్ అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ భూములపైనే ఆధారపడి బతుకుతున్నామని, వీటిని లాక్కుంటే తాము జీవనాధారం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 174 ఎకరాల పోడు భూమిలో తమకు 74 ఎకరాలు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు కోరారు.
మిగతా 100 ఎకరాల భూమిని పోడు రైతులకు సర్వే చేసి అడ్జెస్ట్ చేసి ఇస్తామని అధికారులు చెప్పారు. ఎస్ఐ జీవన్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి ఎఫ్ఆర్వో సుభాష్‌తో రైతుల ముందే ఫోన్లో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పోడు రైతులకు సర్వే చేసి హద్దులు పెట్టి భూమిని అడ్జెస్ట్ చేసి ఇస్తామని ఎస్ఐ జీవన్ హామీ ఇచ్చినట్లు సర్పంచ్ నారాయణ, రైతులు తెలిపారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో సుభాష్‌ను వివరణ కోరగా కర్జెల్లి బీట్‌లో 174 ఎకరాల పోడు భూమి రైతుల ఆధీనంలో ఉందని ఇందులో 74 ఎకరాలు రీట్రైవ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.