నిర్మల్ అర్బన్, ఆగస్టు 20 : నిర్మల్ జిల్లాలో ప్లాస్టిక్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ విక్రయాలు జరపొద్దని అధికారులు హెచ్చరిస్తున్నా ఆగడం లేదు. నిర్మల్ మున్సిపల్ పరిధిలో కమిషనర్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. మిగతా భైంసా, ఖానాపూర్‌లలో తనిఖీలు లేకపోవడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాపారం, వినియోగం పెరిగింది. అధికారుల తనిఖీలు లేక, విక్రయాలకు అడ్డకట్ట వేయకపోవడంతో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం పెరిగింది.
ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణానికి పెను ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేల, నీటి కాలుష్యం పెరిగి జీవవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలుపుతున్నారు. ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడానికి దాదాపు 100 ఏండ్లకుపైగా పడుతుంది. నేలలో కలిసి పంటల దిగుబడిని తగ్గిస్తుంది. నీటిలో చేరి తాగునీటి నాణ్యతను దెబ్బతీస్తుంది. చేపలు, జలజీవుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ప్లాస్టిక్ కాల్చడం వల్ల విషవాయువు విడుదలై శ్వాసా కోశ సమస్యలు తలెత్తుతాయి. ప్లాస్టిక్‌లో ఉన్న బీపీఏ కెమికల్స్ హార్మోన్, క్యాన్సర్‌కు కారణమవుతాయి. కాల్చడం వల్ల గ్రీన్ హైజ్ గ్యాస్ విడుదలై గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది.
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగింబొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లాలో అమలు కావడం లేదు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2వేల దుకాణాలు ఉన్నప్పటికీ వీటిలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ విక్రయాలు కొనసాగుతున్నాయి. నిర్మల్, ఖానాపూర్, భైంసా ప్రధాన పట్టణాల్లో కేవలం ప్లాస్టిక్ విక్రయించే దుకాణాలు ఉండడం విశేషం. ఇక్కడి నుంచే చిరు దుకాణ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వీరి ద్వారానే గ్రామాల్లోని ఇంటింటికీ ప్లాస్టిక్ చేరుతుంది. ఇటీవల నిర్మల్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. దుకాణాలు, బేకరీలు, స్వీట్ హోం వ్యాపారులు, ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాదారులందరికీ రూ.51,500 జరిమానా విధించారు. కాగా.. ప్లాస్టిక్ వినియోగానికి బదులు జ్యూట్ బ్యాగులు, గుడ్డతో తయారు చేసి సంచులు వాడాలి.
నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామ పంచాయతీ ప్లాస్టిక్‌ను 100 శాతం నిషేధించి జిల్లాకే ఆదదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో దాదాపు 500 గృహాలు ఉండగా.. ప్రతీ ఇంటికి ప్లాస్టిక్‌ను ఆదిలోనే నిషేధించేందుకు ఇంటింటికీ తడిపొడి చెత్త డబ్బాలు, మార్కెట్‌కు కిరాణ దుకాణానికి వెళ్లినప్పుడు ఉపయోగపడే జ్యూట్ బ్యాగులు, పాఠశాలకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, చికెన్, మటన్‌ను ఇంటికి తీ సుకెళ్లేందుకు టిఫిన్ బాక్సులు, హోటల్లలో ప్లా స్టిక్ కప్పులు వాడకుండా ఉండేందుకు స్టీల్ గ్లాసులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆ ది నుండే ప్లాస్టిక్ వాడకానికి కావాల్సిన సామగ్రిని ఇంటింటికీ పంపిణీ చేసి ప్లాస్టిక్ వినియోగ రహిత గ్రామ పంచాయతీగా నిలుస్తున్నది. ప్రతి ఊరు గ్రామం చిట్యాల్ గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.