బోథ్, ఆగస్టు 11 : ఆ ఉపాధ్యాయుడు పిల్లలతో మమేకమవుతున్నాడు. వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నాడు. ఆటాపాటలతో చదువు నేర్పుతున్నాడు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాడు. ప్రతి నెలా రాష్ట్ర స్థాయిలో ప్రచురించే ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) పుస్తకంలో చోటు దక్కించుకున్నాడు. బోథ్ మండలంలోని కన్గుట్ట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న చిలుక సతీశ్ తోటి ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు వినూత్నంగా పాఠ్యాంశాలు బోధిస్తున్నాడు. ఈ రోజు పాఠ్యాంశాలు, రోజుకు ఒక పరీక్ష, పిల్లల ఇంటికి చదువు, తల్లిదండ్రులే బోధకులు, స్పోకెన్ ఇంగ్లిష్, చిత్రలేఖనం ద్వారా ఇంగ్లీషు అభ్యసనం, విజ్ఞాన అంశాల అభ్యసనం, మా అనుభవాలు పుస్తక రూపకల్పన వంటి వాటితో నిత్యం పాఠాలు బోధిస్తున్నారు.
ఏరోజుకారోజు పిల్లల పరిణితిని వాట్సాప్ గ్రూపు ద్వారా తల్లిదండ్రులకు చేరవేస్తున్నారు. వెనుకడిన విద్యార్థుల వివరాలను పోషకులకు వివరిస్తున్నారు. పాఠ్యాంశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న వాటి వివరాల కోసం క్షేత్రస్థాయిలో పిల్లలను తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. చార్టులు, డిజిటల్ బోర్డులపై బొమ్మలతో అర్థమయ్యే రీతిలో చదువు చెబుతున్నారు. హెచ్ఎం రాకేశ్‌కుమార్ సహకారంతో తోటి ఉపాధ్యాయులతో కలిసి పిల్లల ఇళ్లకు వెళ్లి పరిణితి వాట్సాప్ గ్రూపుల ద్వారా చేరవేస్తున్న విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచిస్తున్నారు. ఈ పాఠశాలలో బోధనలో సరికొత్త ఒరవడిని గుర్తించి ప్రతి నెలా విద్యాశాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న ఎస్సీఈఆర్టీ పుస్తకంలో జూలై మాసంలో వివరాలను ప్రచురించారు. ప్రైవేటుకు దీటుగా కన్గుట్ట పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా బోధన వివరాలు ఎస్సీఈఆర్టీ పుస్తకంలో ప్రచురితమై గుర్తింపు రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యా బోధనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. పిల్లలకు అర్థమయ్యే రీతిలో విభిన్న పద్ధతుల్లో పాఠాలు బోధిస్తున్నాం. ఈ రోజు పాఠ్యాంశాలు, పిల్లల ఇంటికి చదువు, రోజూ ఒక పరీక్ష, స్పోకెన్ ఇంగ్లిష్, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన వంటి పద్ధతుల్లో పాఠాలు చెబుతున్నాం.. పిల్లల తల్లిదండ్రులకు విద్యార్థుల పరిణితిని వాట్సాప్ ద్వారా చేరవేస్తున్నాం.
-చిలుక సతీశ్, ఉపాధ్యాయుడు