Water | ఎదులాపురం, మే 14 : తుప్పు పట్టిన యంత్రాలు.. ఏళ్ల తరబడి వాడుతున్న క్యాన్లు.. నాచు, పాకురుతో నీటి నిల్వ ట్యాంకులు, పరిసరాల్లో పాటించని పరిశుభ్రత.. అనుమతులు లేవు.. నిబంధనలు బేఖాతర్.. ఇలా మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా ఆరోగ్యం కోసం మినరల్ వాటర్ కొనుక్కుంటున్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కొందరు ప్లాంట్ల నిర్వాహకులు డబ్బులే పరమాపధిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న మినరల్ దందాపై అధికారుల పర్యవేక్షణ కరువైందన్న విమర్శలున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే మినరల్ పేరిట జనరల్ వాటర్‌ను ప్రజలకు సరఫరా చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు ప్లాంట్ల నిర్వాహకుల ఆగడాలను అరికట్టాల్సి ఉన్నప్పటికీ ఏనాడూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆనారోగ్యం పాలై ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నా పర్యవేక్షించే వారు కరువయ్యారు.
వాటర్ ప్లాంట్ల నిర్వహణ తీరుపై గతంలో హైకోర్టులో విచారణలు కొనసాగాయి. ఐఎస్ఐ ప్రమాణాలను గాలికొదిలేసి చేస్తున్న వ్యాపారాలపై కొరడా ఝులిపించాలని పేర్కొంటూ పలు శాఖలకు ఆదేశాలు సైతం జారీ చేసిన విషయం తెలిసెందే. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మొత్తం 49 వార్డులుండగా.. వార్టుకు 5 నుంచి 10 మినీ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇలా అన్ని వార్డుల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్లు ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా చేస్తున్నాయి.
ఇంటింటికీ వచ్చి క్యాన్లలో నీళ్లను విక్రయించే వారి దందా మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. క్యాన్లలో కచ్చితమైన శుద్ధీకరించిన నీళ్లున్నాయా? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఐఎస్ఐ మార్క్ కనిపిస్తున్నా అసలుదో, నకిలీదో గుర్తించడం ప్రజలకు కష్టంగా మారింది. పట్టణాన్ని ఆనుకొని ఉన్న వార్టులు, గ్రామాల్లో పదుల సంఖ్యలో వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజువారీగా లక్షల లీటర్ల నీళ్లను బాటిళ్లలో నింపి సరఫరా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న నీళ్ల బాటిళ్లపై అధిక మొత్తంలో డబ్బులు లాగుతున్నా అధికారులెవ్వరూ నోరు మెదపడడం లేదన్న విమర్శలున్నాయి. పైగా వాటికున్న అనుమతుల అంశంపై కనీసం మాటైనా మాట్లాడడం లేదన్నది వాస్త వం. అనధికారికంగా నడుస్తున్న ప్లాంట్లు యథేచ్ఛగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఐఎస్ఐ ప్రమాణాలు పాటించకుండానే వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. బోరు బావికే నేరుగా కనెక్షన్లు ఇచ్చి బాటిళ్లలో నింపుతూ ప్రజల్ని శుద్ధి జలాల మాటున ముంచేస్తున్నారు.
ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న నీళ్ల వ్యాపారులు రెండుమూడు గల్లీలకు షటర్లు అద్దె కు తీసుకుంటూ వాటర్ ప్లాంట్లు పెట్టకుంటున్నా రు. సాధారణ వాటర్ క్యాన్‌కు రూ.10 నుంచి రూ.15, కూల్ వాటర్ క్యాన్లకైతే రూ.30 నుంచి రూ.40 ధర వసూలు చేస్తున్నారు. పట్టణంలో సుమారుగా రెండు లక్షల్లోపు జనాబా ఉంటారు. మినరల్ వాటర్ ప్రజలకు అలవాటు చేయడంతో నీళ్ల వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మినరల్ వాటర్ ఇవ్వడం లేదు. వాటర్‌లో కొద్దిగా తీయగా వచ్చేలా కెమికల్ వాడుతున్నారన్న ఆరోపనలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.