ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పదేండ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కడుతున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ విజయదుందుభి మోగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న రెండు పార్టీలు క్యాడర్ ఖాళీ అవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
ఆదిలాబాద్, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరాణకు గురైన ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు జిల్లావాసులకు వరంగా మారాయి. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సరఫరా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రెసిడెన్షియల్ పాఠశాలలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రూపాయి కిలో బియ్యం, ఆరోగ్యలక్షి, కులవృత్తులకు ప్రోత్సాహం అందించడంలో భాగంగా గొర్రెలు, చేప పిల్లలు పంపిణీ, దళితబంధు, బీసీ కులవృత్తులకు రూ. ఒక లక్ష ఆర్థిక సాయం లాంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. సర్కారు పథకాల ఫలితంగా పేదల ఉపాధి మెరుగుపడింది. గ్రామాల్లో ఇంటింటికీ మూడు నుంచి ఆరు పథకాలు అందుతుండడంతో ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పదేండ్లలో జిల్లా అభివృద్ధితోపాటు, సర్కారు పథకాల వల్ల ప్రయోజనం చేకూరడంతో ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు.
భారీగా చేరికలు
ఆదిలాబాద్ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. బీఆర్ఎస్కు ప్రజల నుంచి రోజురోజుకు మద్దతు పెరుగుతుండడంతో వారు ఉంటున్న పార్టీల మనుగడ కష్టమని తెలిపోవడంతో బీఆర్ఎస్లోకి వస్తున్నారు. రెండ్రోజుల్లో ఆదిలాబాద్, జైనథ్ మండలాలకు చెందిన రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలను స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో అంతర్గత పోరు రోజురోజుకు అధికమవుతోంది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. రెండు పార్టీల్లో వర్గపోరు ఫలితంగా ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. తమ పార్టీ క్యాడర్ను కాపాడుకోవడానికి నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ రోజురోజుకు బలహీన పడుతోంది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల చేరికలతో బీఆర్ఎస్ బలపడగా.. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
మహిళా సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు, యువత 400 మంది బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలితంగా ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. మహిళా సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రచారానికి వచ్చే వారు చేసిన అభివృద్ధిపై నీలదీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, కౌన్సిలర్ అంజుబాయి, నాయకులు అనంద్, ఎజాజ్, స్వరూపారాణి, సలీంపాషా, పర్వీన్, ఆశన్న పాల్గొన్నారు.
– ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న