శ్రీరాంపూర్, సెప్టెంబర్ 20 : సింగరేణి సంస్థ నికర వాస్తవ లాభాల్లో నుంచి కార్మికులకు 35 శాతం వాటా ఇవ్వాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం శ్రీరాంపూర్ ఆర్కే న్యూటెక్‌పై ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి, లాభాల వాటా సాధనకు సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్ ఆందోళనలు చేసిందన్నారు.
హైదరాబాద్ సింగరేణి భవన్ కూడా ఎన్ని నిర్బంధాలు పెట్టినా కార్మిక వర్గంతో కదం తొక్కి ధర్నా చేసి యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. యాజమాన్యం రెండు రోజుల్లో కార్మికులకు 35 శాతం లాభాల వాటా ప్రకటించక పోతే సింగరేణి వ్యాప్తంగా జీఎం కార్యాలయాల ముందు కార్మికులు, మహిళా కార్మికులతో బతుకమ్మ ఆటా పాటలతో నిరసన చేపడుతామని హెచ్చరించారు.
గతేడాది లాగా లాభాలను తకువ చేసి చూపించి కార్మికులను మళ్లీ నయవంచనకు గురిచేస్తే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణిలో గనులు మూతపడుతున్నాయని, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ గనులు షాఫ్ట్ బ్లాక్‌ల ఏర్పాటుకు అనుమతులు పొందడం లేదన్నారు. ఉన్న గనుల్లో ఉత్పత్తి తీసేందుకు ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అనుమతులు సాధించి కొనసాగించాలని డిమాండ్ చేశారు. వేలం ద్వారా గనులు సాధించుకున్నా ఒక్క పర్మినెంట్ కార్మికుడు ఉండరని పేర్కొన్నారు.
6 నెలలుగా సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, యాజమాన్యంతో పెట్టించడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ విఫలమవుతుందన్నారు. వెంటనే మెడికల్ బోర్డు పెట్టించాలని డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి చందా తీసుకున్నామన్నారు. కానీ ఏఐటీయూసీ కార్మికుల వద్ద దౌర్జన్యంగా కార్మికుల అనుమతి లేకుండా 50 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తుందని ఆరోపించారు.
యాజమాన్యం ఏఐటీయూసీకి పే షీట్ ద్వారా చందా రికవరీకి సహరించరాదని డిమాండ్ చేశారు. కార్మికులు కూడా ఏ కార్మిక సంఘం ద్వారా హక్కులు వచ్చాయో, ఏ సంఘం దోపిడీ చేస్తుందో ఆలోచించి చందా ఇవ్వాలని కోరారు. కార్మికులు కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే బాగుండేనని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జాతీయ కార్మిక సంఘాలు కార్మికులకు 1.25 లక్షల రూపాయల దీపావళి బోనస్ సాధించి పెట్టాలని డిమాండ్ చేశారు. 190/240 మస్టర్లు చేసిన బదిలీ వరర్లకు జనరల్ అసిస్టెంట్ ప్రమోషన్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న డిజిగ్నేషన్‌లో ఇంటర్నల్ అభ్యర్థులచే భర్తీ చేయాలని, పెండింగ్ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
టీబీజీకేఎస్‌లో వివిధ సంఘాల నాయకులు చేరిక
ఆర్కే న్యూటెక్ గనిలో గనిలో వివిధ యూనియన్‌లో పనిచేస్తు న్న 43 మంది నాయకులు, కార్మికులు పిట్ కార్యదర్శి ఉప్పా ల సంపత్ ఆద్వర్యంలో టీబీజీకేఎస్‌లో చేరగా వారికి అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి కండువాలు కప్పి యూనియన్‌లోకి స్వాగతం పలికారు. వివిధ యూనియన్లకు చెందిన ఎం శ్రీనివాస్, తిరుపతి, రాజబాపు, భగవాన్, కిష్టయ్య, శంకర్, గాజుల శివవశంకర్, రాజేంద్రప్రసాద్, ఎస్కే ఇస్మాయిల్, ఎస్ కుమార్, ఎం శ్రీకాంత్, రమేశ్, రవి, కే లచ్చన్న, కే బాపు, కొండాల్‌రెడ్డి, ప్రశాంత్, నరేశ్, ఐ హరీశ్, ఆజయ్, జీ రంజిత్ యూనియన్‌లో చేరారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి పానుగంటి సత్తయ్య, మాజీ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేశ్, కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్వేష్‌రెడ్డి, ఎండీ లాలా, ఏరియా సెక్రటరీ సాదుల భాసర్, వెంగళ కుమారస్వామి, పిట్ సెక్రటరీ ఉప్పాల సంపత్, అసిస్టెంట్ ఫీట్ సెక్రటరీ జైపాల్‌రెడ్డి నాయకులు గాజుల దేవేందర్, జంగ తిరుపతి రెడ్డి, తౌటి నరేశ్, తిరుపతిరావు, చంద్రగిరి మల్లేశ్, చిప్ప రమేశ్, అశోక్, రాజు నాయక్, సుధాకర్, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.