మంచిర్యాల, మే 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు స్వరం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడిన నేపథ్యంలో.. నేడు(సోమవారం) పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.
ఇందులో ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 16,50,175 మంది, పెద్దపల్లి సెగ్మెంట్లో 15,96,430 మంది ఓటర్లు ఉన్నారు. వీరంగా నేడు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ సామగ్రి, ఈవీఎంలను ఆదివారం సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగింటిలో పోలింగ్ రెండు గంటల ముందుగానే పూర్తికానున్నది.
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలుసహా మంథని నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోనూ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మిగిలిన నియోజవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉండనుంది. నిర్దేశిత సమయంలోపు వచ్చి లైన్లో నిలబడిన ఓటర్లందరూ ఓటు వేసేందుకు సమయం ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తరలింపు
పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన సామగ్రి ఆదివారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు తరలించారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలుసహా నియోజకవర్గ కేంద్రం నుంచి సామగ్రిని, సిబ్బందిని అధికారులు పోలింగ్ నిర్వహించేందుకు వారికి కేటాయించిన కేంద్రాలకు వెళ్లారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో 2,197 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 802 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, మే 12 : ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు సిబ్బందికి ఆదివారం పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. మెటీరియల్ తీసుకున్న సిబ్బంది వాహనాల్లో తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. పంపిణీ కేంద్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పరిశీలించారు. విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.
ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి ఆసిఫాబాద్ పట్టణంలోని పీటీజీ బాలుర గురుకుల పాఠశాల, సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి కాగజ్‌నగర్ పట్టణంలోని సెయింట్ క్లారిటీ పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ సురేశ్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి దీపక్ తివారీ, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణుతో కలిసి పరిశీలించారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 356, సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 320 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ, ఫ్యాన్లు, విద్యుత్ సరఫరా, మూత్రశాలలు, ర్యాంపు సౌకర్యాలతో పాటు వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
గర్భిణులు, వయోవృద్ధులు, దివ్యాంగులు ఓటు హకును వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 10 మహిళా పోలింగ్ కేంద్రాలు, 2 దివ్యాంగ పోలింగ్ కేంద్రాలు, 2 యువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించేందుకు 20 శాతం అదనపు సిబ్బందిని కలుపుకొని మొత్తం 3,244 మందిని నియమించినట్లు తెలిపారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన 676 పోలింగ్ కేంద్రాలకు 91 రూట్లుగా విభజించి 91 మంది రూట్ అధికారులను నియమించామని, 91 మంది సూక్ష్మ పరిశీలకులు, 91 మంది సెక్టార్ అధికారులను కేటాయించనట్లు చెప్పుకొచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఎన్నికల నిర్వహణ కోసం సెక్టార్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులను నియమించి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలను అనుసంధానం చేశామని, రూట్లలో వెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్ అమర్చామని తెలిపారు. జిల్లాలో 55 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఇంటర్నెట్ సౌకర్యం లేని 61 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ క్రమంలో సీఆర్పీఎఫ్, పారా మిలిటరీ బలగాలతో పాటు ప్రత్యేక పోలీసు అధికారులు, సిబ్బంది, అటవీ శాఖ సిబ్బందిని విధుల కోసం నియమించినట్లు తెలిపారు. ఈ నెల 13న ముందుగా మాక్ పోల్ నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతాన్ని తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు..
మంచిర్యాల జిల్లాలో..
నస్పూర్, మే 12 : పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం నిర్వహించనున్న పోలింగ్‌కు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. డీసీపీ అశోక్‌కుమార్, ఆర్డీవో రాములు, ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి సందర్శించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పంపిణీ చేశారు. చెన్నూర్ సెగ్మెంట్లో 227 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 272 మంది ప్రిసైడింగ్, 272 మంది సహాయ ప్రిసైడింగ్, 544 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు, 30 మంది సూక్ష్మ పరిశీలకులు, 28 మంది సెక్టార్ అధికారులను నియమించారు. 681 బ్యాలెట్ యూనిట్లు, 227 కంట్రోల్ యూనిట్లు, 227 వీవీ ప్యాట్లు కేటాయించి 175 బ్యాలెట్లు, 64 కంట్రోల్ యూనిట్లు, 86 వీవీ ప్యాట్లను అదనంగా కేటాయించారు.
బెల్లంపల్లి సెగ్మెంట్లో 227 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 272 మంది ప్రిసైడింగ్, 272 మంది సహాయ ప్రిసైడింగ్, 544 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు, 33 మంది సూక్ష్మ పరిశీలకులు, 30 మంది సెక్టార్ అధికారులను నియమించారు. 681 బ్యాలెట్ యూనిట్లు, 227 కంట్రోల్ యూనిట్లు, 227 వీవీ ప్యాట్లు కేటాయించి 175 బ్యాలెట్, 62 కంట్రోల్, 87 వీవీ ప్యాట్లను అదనంగా కేటాయించారు.
మంచిర్యాల సెగ్మెంట్ పరిధిలో 287 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 344 మంది ప్రిసైడింగ్, 344 మంది సహాయ ప్రిసైడింగ్, 688 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు, 32 మంది సూక్ష్మ పరిశీలకులు, 30 మంది సెక్టార్ అధికారులను నియమించారు. 861 బ్యాలెట్ యూనిట్లు, 287 కంట్రోల్ యూనిట్లు, 287 వీవీ ప్యాట్లను కేటాయించి 219 బ్యాలెట్, 82 కంట్రోల్, 110 వీవీ ప్యాట్లను అదనంగా కేటాయించారు.