సిర్పూర్(టీ), అక్టోబర్ 6 : ‘మా పిల్లలను ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు తరలించవద్దు’ అంటూ సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ధర్నాకు దిగారు. సిర్పూర్(టీ) గురుకుల పాఠశాలలో డైనింగ్ హాల్ ఇతర పాఠశాల గదులు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులను ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాసిపేట, జైపూర్, మెట్టుపల్లి (కోరుట్ల)లలోని రెసిడెన్షియల్ పాఠశాలలకు రెండు నెలల క్రితం అధికారులు తరలించారు.
విద్యార్థులకు సిర్పూర్(టీ)లోనే తాత్కాలిక భవనం ఏర్పాటు చేయాలని, తమ పిల్లలను తిరిగి ఇక్కడికే తీసుకురావాలని తల్లిదండ్రులు కొన్నిరోజులుగా విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇందుకు నిరసనగా వారు ధర్నాకు దిగారు. వీరికి మద్దతు తెలిపి బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. విద్యార్థులతో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వీడియో కాల్లో మాట్లాడారు. సమస్యపై ఉన్నాతాధికారులతో మాట్లాడుతానని తెలిపారు. దాదాపు 4 గంటలకు పైగా ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ ఏర్పడింది. ఎస్ఐ సురేశ్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.