కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని 334 గ్రామ పంచాయతీల్లో పాల న పడకేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో పంచాయతీల నిర్వహణ గాడితప్పి పరిస్థితి అధ్వానంగా మారుతున్నది. టాక్సీల రూ పంలో వచ్చే నిధులను కరంటు బిల్లులకు చెల్లిస్తున్నా రు. ట్రాక్టర్ల నిర్వహణ కూడా పంచాయతీలకు కష్టం గా మారింది. ట్రాక్టర్ల మెయింటనెన్స్, డీజిల్, మరమ్మతుల కోసం పంచాయతీ కార్యదర్శులు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టాల్సి వస్తున్నది.
వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ కష్టంగా మారగా, అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. కేసీఆర్ సర్కారులో ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించగా, అద్భుతమైన పాలన సాగింది. కానీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిధులు విడుదల కాక అభివృద్ధి కుంటుపడుతున్నది. ఆరేడు నెలలుగా పారిశుధ్య సిబ్బందికి వేతనాలు అందించలేని దుస్థితి నెలకొంది. వానకాలంలో కూడా ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటే ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు.
మా ఊరిలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న. కొన్ని నెలలైతంది జీతాలు ఇవ్వక. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. కనీసం ఇంటికి అవసరమైన సరుకులు కొందామన్నా చిల్లి గవ్వ లేకుంటైంది. దుకాణపోళ్లు ఉద్దెర ఇవ్వడం లేదు. ఇది వరకు మంచిగనే జీతాలిచ్చేటోళ్లు. ఇప్పుడు మస్తు కష్టమైతంది. గీ పని బంద్ చేసి ఏదైనా కూలీ పనులకు పోతే మంచిగుండు అనిపిస్తుంది. ఇప్పటికైనా సర్కారోళ్లు స్పందించి మా జీతాలివ్వాలి.
– పాముల రాము, పారిశుధ్య కార్మికుడు, పెంచికల్పేట్