సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 23: జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరాన్లో ఉగ్రవాదులు జరిపిన దాడులను నిరసిస్తూ మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. మృతులకు సంతాపంగా పలు చోట్ల కొవ్వొత్తులతో ర్యాలీలు తీశారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లో మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి ఆధ్వర్యంలో విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీ తీసి మృతులకు నివాళులర్పించారు.
టూరిస్ట్‌లపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులే లక్ష్యంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుని ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సందనవేణి శ్రావణ్, రాజు, క్రాంతి, అఖిల్, శ్రీనివాస్, రేగళ్ల ఉపేందర్, నల్లపు శ్రీనివాస్, గోళ్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.