కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిపోతున్నది. కొందరు వ్యాపారులు మాఫియాగా ఏర్పడి వివిధ మార్గాల్లో రవాణా చేస్తూ సొమ్ముచేసుకోవడం పరిపాటిగా మారింది. టాస్క్ఫో ర్స్ దాడులు చేస్తూ నిత్యం ఎక్కడో ఒకచోట పట్టుకుంటున్నా.. దందాకు బ్రేక్ పడడం లేదు. స్థానిక అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల సహాయ సహకారాలతోనే ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కిలోకు రూ.12కు కొని.. రూ. 20కు అమ్మి
జిల్లాలోని సరిహద్దు మండలాల నుంచి కొందరు వ్యాపారులు రేషన్ బియ్యం దందా జోరుగా సాగిస్తున్నారు. కాగజ్‌నగర్ అడ్డాగా ఇటు మంచిర్యాల, బెల్లంపల్లి, రెబ్బెన నుంచి, మరో వైపు ఆసిఫాబాద్ నుంచి సిర్పూర్-టీ మీదుగా చౌక బియ్యాన్ని పొరుగు రాష్ర్టానికి తరలిస్తున్నారు. జిల్లా నుంచి మహారాష్ట్ర వరకు ఎక్కడా చెక్‌పోస్టులు లేకపోవడంతో వీరికి కలసివస్తున్నది. ప్రతి నెలా రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు బియ్యం ఇవ్వడం ప్రారంభమైనప్పటి నుంచి దందా మొదలవుతున్నది.
కొన్ని ప్రాంతాల్లోని రేషన్ డీలర్లు షాప్‌నకు వచ్చే లబ్ధిదారుల వద్దే బియ్యం కొనుగోలు చేసి దందా సాగిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు రేషన్ డీలర్ల వద్ద నేరుగా కొనుగోలు చేసి సిర్పూర్-టీ మండలంలోని వెంట్రావ్పేట్, వాంకిడికి తరలించి, అక్కడి నుంచి మహారాష్ట్రకు చేరవేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, వ్యాన్లలో సరిహద్దులోని గ్రామాలకు తరలించి, అక్కడి గోదాముల్లో డంప్ చేస్తుంటారు.
అక్కడి నుంచి భారీ వాహనాల్లో గొందియా, బల్హార్షాల్లోని రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. ఇక్కడ కిలోకు రూ. 12 చొప్పున కొనుగోలు చేసిన బియ్యాన్ని మహారాష్ట్రలో రూ. 20 చొప్పున విక్రయిస్తున్నారు. కేవలం 10 రోజుల్లోనే సుమారు 200 క్వింటాళ్ల బియ్యం దాకా పట్టుబడ్డాయంటే ఈ దందా ఏ మేరకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహిస్తే తప్ప స్థానిక అధికారులు బియ్యం రవాణాను అడ్డుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతోందన్న ఆరోపణలకు బలం చేకూరుతున్నది.