బెల్లంపల్లి, ఏప్రిల్ 1 : రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మాత్రం చేపట్టలేదు. లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు రాగా మూసి ఉండడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతుల మీదుగా ప్రారంభించేందుకే పంపిణీ చేయలేదని ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయం తెలుసుకొని రేషన్ షాపుల వద్ద బీజీపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేశ్ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ప్రారంభించే వరకు బియ్యం పంపిణీ చేయవద్దని రేషన్ డీలర్లకు ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్లు చేసి దుకాణాలు మూయించారని ఆరోపించారు.
బియ్యం పంపిణీ చేయకుండా లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే పది రోజుల వరకు రాకపోతే పేదలు పస్తులు ఉండాల్సిందేనా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై లబ్ధిదారులతో పాటు వివిధ పార్టీలు, సంఘాల నుంచి విమర్శలు రావడంతో సాయంత్రం నుంచి షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేశారు.
అలా ప్రారంభించారు.. ఇలా నిలిపివేశారు..
కాసిపేట, ఏప్రిల్ 1 : కాసిపేట మండలంలోని ఆయా గ్రామాల్లో రేషన్ షాపుల వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించిన కొద్దిసేపటికి నిలిపివేశారు. రేపు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభిస్తారని, అప్పటి వరకు నిలిపి వేయాలని ఆదేశాలు రావడంతోనే నిలిపివేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై కాసిపేట తహసీల్దార్ భోజన్నను వివరణ కోరగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతుల మీదుగా అధికారిక ప్రారంభోత్సవం ఉంటుందని ఉన్నతాధికారులు తెలుపగా నిలిపివేసినట్లు చెప్పారు.