ఆదిలాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ) : ఆన్లైన్ గేమింగ్ పేరిట ప్రజలకు లాభాలు వస్తాయని ఆశ చూపిన ముఠా గుట్టు రట్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆన్లైన్ గేమింగ్ ముఠా సభ్యులు బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని పంచవటీ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారని, కొందరు వ్యక్తులతో గేమ్ అడిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
గదిలో ఐదుగురు ఉండగా ఒకరు పారిపోయారు. మిగతా ప్రకాశ్ బద్దు రాథోడ్, జాదవ్ ప్రహ్లాద్, పంకజ్ నాందేవ్, బోంద్రే సూర్యభాన్లను పట్టుకున్నామన్నట్లు పేర్కొన్నారు. వీరిని విచారించగా నెక్సబెట్ అనే గేమ్‌లో రూ.9100 పెట్టుబడి పెడితే గెలిచిన తర్వాత 100 అమెరికన్ డాలర్లు వస్తాయని నమ్మిస్తూ గేమ్ అడిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి నెక్సబెట్ పుస్తకాలు, క్రేటా కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
పట్టణంలోని బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ చౌక్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో స్కూటీపై ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వచ్చి పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేయగా అతన్ని పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. అతన్ని విచారిస్తే తన పేరు దహికాంబ్లే వికాశ్ అని తేజా మెడికల్ దుకాణంలో పనిచేస్తున్నట్లు తెలిపాడని చెప్పారు. తాను టెర్మిన్ డ్రగ్ మూడు చిన్న బాటిళ్లను రూ.369కు కొనుగోలు చేసి రూ.1500 అమ్మడానికి గుడిహత్నూర్‌కు వెళ్తున్నట్లు తెలిపాడని అన్నారు. మెడికల్ షాపు యజమానులకు డ్రగ్స్‌పై పర్యవేక్షణ ఉండాలన్నారు. యువత డ్రగ్స్‌కు బానిపై జీవితాలను పాడుచేసుకోవద్దని సూచించారు.
మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ప్రభుత్వ లెకర్చర్పై కేసు నమోదు చేశామన్నారు. ట్రేసూర్ ఫన్ అనే సంస్థలో పెడ్డుబడులు పెడితే 3 శాతం వడ్డీతోపాటు ఇతరులను సంస్థలో చేర్పిస్తే రూ.200 అధికంగా ఇస్తామని అమాయకులను మోసం చేస్తున్న ఆదిలాబాద్ పట్టణం పాత హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ప్రభుత్వ లెక్చరర్ సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు మల్టీలెవల్ మార్కెటింగ్‌పై అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురైతే 1930కు ఫోన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ సునీల్ కుమార్ పాల్గొన్నారు.