నస్పూర్/మంచిర్యాల అర్బన్/సీసీసీ నస్పూర్/ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్/, నవంబరు 18 : గ్రూప్-3 పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మంచిర్యాల జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆఖరి రోజు 8,185 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వీ, ఎస్‌ఆర్‌డీజీ పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. మంచిర్యాల ఆర్బీహెచ్వీ, సీసీసీ నస్పూర్ సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల, సీసీసీ నస్పూర్‌లోని ఆక్స్‌ఫర్ట్ హైస్కూల్, సింగరేణి హైస్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను రామగుండం సీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి పరిశీలించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయాచోట్ల గ్రూప్-3 నోడల్ అధికారి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్ రావు, రూరల్ సీఐ అశోక్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేశ్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పరిశీలించారు. జిల్లాలో మొత్తం 18 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 4471 మంది అభ్యర్థులకుగాను.. 2757 మంది హాజరయ్యారయ్యారని ఆయన తెలిపారు. ఆసిఫాబాద్‌లోని పీటీజీ బాలుర గురుకుల పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను నోడల్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ పరిశీలించారు. ప్రాంతీయ సమన్వయకర్త లక్ష్మీనరసింహ, రూట్ అధికారులు, ముఖ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు.