ఆదిలాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏడో రోజైన బుధవారం నామినేషన్ల జోరు కనిపించింది. ప్రధాన పార్టీలతోపాటు పలువురు 12 నామినేషన్లను దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి అత్రం సక్కు తరఫున మూడో సెట్ నామినేషన్ పత్రాలను జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, మథోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు కిరణ్ కొమ్రేవార్, ఇతర నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు అందజేశారు. నాలుగో సెట్ పత్రాలను బీఆర్ఎస్ మథోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యురాలు డాక్టర్ రమాదేవి, ఇతర నాయకులు నాలుగో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. బీజేపీ అభ్యర్థి నగేశ్ ఆదిలాబాద్, నిర్మల్, మథోల్, సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌లతో కలిసి నామినేషన్ వేశారు. ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు మరో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగుణ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి మూడో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ డమ్మి అభ్యర్థిగా రాథోడ్ రమేశ్, గొండ్వానా దండ కారణ్య పార్టీ అభ్యర్థిగా కొడప వామన్ రావు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నేతావత్ రాందాస్, కుమ్రం ముత్తయ్యలు నామినేషన్లు వేశారు. నామినేషన్ల వేయడానికి నేడు(గురువారం) చివరిరోజు కావడంతో అధిక సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశాలున్నాయి. మూడు ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్లు నామినేషన్ వేయడానికి రాగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఏర్పాట్లను పర్యవేక్షించారు.