మంచిర్యాల, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండగా, మంచిర్యాల పట్టణ ప్రజలకు వరద టెన్షన్ పట్టుకున్నది. కడెం ప్రాజెక్టుకు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, సోమవారం ఉదయానికి 2.30 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. మొత్తం 18 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. అలాగే ఎస్సారెస్పీ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
ఈ సీజన్లో అత్యధికంగా సోమవారం ఉదయం ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి నుంచి దిగువకు వదిలారు. సోమవారం మధ్యాహ్నానికి 30 గేట్లు 4 మీటర్ల మేర ఎత్తి నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇటు కడెం, అటు ఎస్సారెస్పీ ప్రాజెక్టుల నుంచి వదిలిన వరద సోమవారం రాత్రికి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద 8 లక్షల నుంచి 10 లక్షల క్యూసెక్కులకు పెరగొచ్చని వారు పేర్కొంటున్నారు.
రాళ్లవాగు రివర్స్ వస్తే..
ఎల్లంపల్లికి వరద పోటెత్తుతుండగా మంచిర్యాల పట్టణవాసుల్లో టెన్షన్ పెరిగిపోతున్నది. లోతట్టు ప్రాంతాల వాసులు గజగజ వణికిపోతున్నారు. 6 లక్షల క్యూసెక్కులు దిగువకు వదలడంతో పట్టణం గుండా ప్రవహించే రాళ్లవాగు నీరు గోదావరిలోకి వెళ్లకుండా నిశ్చలంగా మారిపోయింది. యేటా గోదావరి వరద ఎక్కువగా రావడం, రాళ్లవాగు నీరు గోదావరిలోకి వెళ్లలేక పట్టణంలోకి రివర్స్ వచ్చి లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడం జరుగుతుంది. సోమవారం రాత్రి భారీ వరద వచ్చే అవకాశాలున్నాయని ఇరిగేషన్ అధికారులు చెబుతుండగా, భయాందోళనలు నెలకొన్నాయి. ఎమ్మెల్యే పీఎస్సార్, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, ఎసీపీ ప్రకాశ్ ఇతర అధికారులు సోమవారం ఉదయం ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు.
ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. భారీ వరద వస్తే తట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి నీరు చేరకుండా 15 టీఎంసీలు మాత్రమే ఉండేలా చూస్తున్నామని, 18 టీఎంసీల వరకు పెరిగినా రెండు, మూడు గంటల పాటు ఆపేస్తామని తెలిపారు. కడెం, ఎస్సారెస్పీ నుంచి 6 లక్షల క్యూసెక్కుల నుంచి 8 లక్షల క్యూసెక్కుల వరద సోమవారం రాత్రి వరకు వచ్చే అవకాశాలున్నాయని, ఆ మేరకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.
ఎంసీహెచ్ నుంచి రోగుల తరలింపు
గోదావరికి మరింత వరద ఉధృతి పెరిగే అవకాశముండగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్) రోగులను తరలించారు. గతంలో భారీ వరదలు వచ్చి హాస్పిటల్ ఫస్ట్ఫ్ల్లోర్ వరకు ముగినిపోయిన ఘటనల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రోగులను తరలించినట్లు డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్ తెలిపారు. ఎమ్మెల్యే పీఎస్సార్, కలెక్టర్ కుమార్ దీపక్ సూచనల మేరకు దవాఖానలోని 130 మంది ఇన్ పేషెంట్లను సురక్షితంగా గవర్నమెంట్ జనరర్ హాస్పిటల్ (జీజీహెచ్), ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తరలించామన్నారు.
అలాగే 21 ఐఎన్సీయూ కేసులు, 7 డెలివరీ అయిన కేసులు, 57 పోస్టాఫ్ కేసులు, ఐసీయూలో 8 కేసులు, పీడియాట్రిక్‌లోని 37 కేసులను ప్రభుత్వ అంబులెన్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ అంబులెన్స్‌లలో తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లిన వారికి మెడిసిన్ కిట్స్ ఇచ్చి పంపించారు. జీజీహెచ్‌కు పంపిన వారి కోసం ఎంసీహెచ్ నర్సులు, డాక్టర్లను అందుబాటులో ఉంచారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్నగర్, రాంనగర్ ముంపు పాంత్రాల్లో జనాలను అప్రమత్తం చేశారు. వరద పెరిగి ముంపు వస్తే ముందుగా ప్రభావితమయ్యే ఇళ్లలోని వారిని సామగ్రి సర్దుకొని సిద్ధంగా ఉండమని చెప్పారు. ఈ రాత్రి వరద ఉధృతి తగ్గితే ప్రమాదమేమీ ఉండదు. ఒకవేళ వరద తీవ్రత పెరిగితే ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.