కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతికి ప్రతీక అ యిన బతుకమ్మ పండుగపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యేటా బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలందరికీ చీరలు పంపిణీ చేసింది. ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభమైన రోజు నుంచి సద్దుల బతుకమ్మ ముగిసే వరకు వాడ వాడలా ఏర్పాట్లు చేసింది.
నాటి వైభవం ఏది..?
కేసీఆర్ సర్కారులో బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు గ్రామాలు, పట్టణాల్లో వాడవాడలా ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి, లైట్లు ఏర్పాట్లు చేసేవారు. దీంతో సాయంత్రం పూట ప్రధాన చౌరస్తాలన్నీ బతుకమ్మ ఆటలతో సందడిగా మారేవి. యేటా బతుకమ్మ పండుగకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయించేవారు. బతుకమ్మ ఆడుకునేందుకు లైట్లు, సౌండ్ సిస్టంవంటివి ఏర్పాటు చేసేవారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ చీరలు పంపిణీ చేసేవారు.
కాంగ్రెస్ హయాంలో కళ తప్పిన పండుగ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ పండుగ కళ తప్పింది. ఇప్పటివరకు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. వాడల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. బతుకమ్మ నిమజ్జనానికి చెరువులు, బతుకమ్మ ఘాట్ల వద్ద లైట్లు, పారిశుధ్య పనులు చేపట్టలేదు. బతుకమ్మ చీరలకు బదులుగా ఇస్తామన్న రూ.500 కూడా ఇవ్వలేదు. పండుగ ప్రారంభమై ఐదారు రోజులైనా ఆ ఊసే ఎత్తడం లేదు. ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో గ్రామాల్లో చందాలు వేసుకొని బతుకమ్మ పండుగకు గ్రామస్తులే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆడబిడ్డల పండుగ బతుకమ్మపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని, వేడుకలపై పట్టింపే లేదని మహిళలు అసహ్యించుకుంటున్నారు.