ఆదిలాబాద్, జూన్ 5 ( నమస్తే తెలంగాణ) : బేల మండలం దుబ్బగూడలో ఫ్లోరైడ్ నీటిని తాగి స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్న సమస్యపై ‘ఫ్లోరైడ్ భూతం’ అనే శీర్షికన శుక్రవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి వివిధ శాఖల అధికారులు స్పందించారు. బేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు వంశీకృష్ణ, ఇన్చార్జి ఎంపీడీవో మహేశ్‌కుమార్‌తో పాటు మిషన్ భగీరథ అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులకు డాక్టర్ వంశీకృష్ణ పరీక్షలు నిర్వహించారు. గ్రామస్తులు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారని, ఇక్కడి బోర్ పంపుల్లో నుంచి వచ్చే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉందన్నారు.
స్థానికుల్లో ఫ్లోరైడ్ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. గ్రామస్తుల్లో బోర్‌బావి నీటిని తాగకుండా రక్షితమైన నీటిని తాగాలని దీంతో వారు ఫ్లోరైడ్ బారిన పడకుండా ఆరోగ్యాలను కాపాడుకోవచ్చన్నారు. ఎంపీడీవో మహేశ్‌కుమార్ స్థానికులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. ఐటీడీఏ నుంచి ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారని, నీటి సమస్య కారణంగా ప్రారంభం కాలేదన్నారు. మిషన్ భగీరథ పథకం నీటిని వినియోగించేందుకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఫ్లోరైడ్ నీటి సమస్య పరిష్కారానికి కొత్తగా బోరులో మోటార్ వేసి ఆర్వో ప్లాంట్ ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు.