కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : జిల్లా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్లక్ష్యం.. గిరిజనులకు శాపంగా మారుతున్నది. రాత్రనకా.. పగలనకా.. అష్టకష్టాలు పడి సేకరించే అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లపై ఆసక్తి చూపకపోవడతో వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితి దాపురిస్తున్నది. గతేడాది అరకొరగా కొనుగోళ్లు చేపట్టగా, ఈ యేడాది అసలు ఆ ఊసే ఎత్తడం లేదంటూ అడవిబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలు ఉండగా, ఇందులో 13.. గిరిజన మండలాలే ఉండడం గమనార్హం. వర్షాకాలంలో వ్యవసాయం చేసుకునే గిరిజనులు.. వేసవి(మార్చి, ఏప్రిల్, మే)లో మాత్రం అటవీ ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంటారు. ఇప్పపూలు, ఇప్పపరక, చిల్లగింజలు, తేనె, జిరుగు, మైనం వంటివి సేకరించి జిల్లా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డీఆర్ డిపోల్లో అమ్ముకొని ఆర్థిక అవసరాలు వెళ్లదీసుకుంటారు.
పట్టించుకోని జీసీసీ
అడవుల్లో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తుల సేకరణను ప్రోత్సహిస్తూ.. వాటిని కొనుగోలు చేయాల్సిన జీసీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యేటా ఫిబ్రవరిలో అటవీ ఉత్పత్తుల ధరలను నిర్ణయించాల్సి ఉండగా, ఈసారి అసలు పట్టించుకోవడం లేదు. అధికారులు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసేవిధంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అత్యధిక గిరిజన గ్రామాలున్న జిల్లాను అటవీ ఉత్పత్తుల సేకరణలో ముందంజలో ఉండాల్సి ఉండగా, వారి అలసత్వంతో లక్ష్యం నెరవేరడం లేదు.
గిట్టుబాటు కల్పించని అధికారులు
అడవుల్లో ప్రాణాలకు తెగించి గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు అధికారులు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమవుతున్నారు. నామమాత్రంగా ధర చెల్లిస్తున్నారు. తేనె ధర మార్కెట్లో కిలోకు రూ. 500 నుంచి రూ. 600 వరకు పలుకుతుంటే.. జీసీసీ అధికారులు మాత్రం కిలోకు రూ. 150 చొప్పున ధర నిర్ణయిస్తున్నారు. ఇప్పపూలకు వ్యాపారుల వద్ద కిలోకు రూ. 40 ఉంటే.. జీసీసీలో మాత్రం రూ. 20 కిలో ధర ఉంటోంది. ఇలా అన్ని అటవీ ఉత్పత్తులపై అధికారులు మార్కెట్ రేటులో సగం కూడా చెల్లించడం లేదు.. కష్టపడి సేకరించిన ఉత్పత్తులకు గిట్టుబాట ధర చెల్లించకపోవడంతో గిరిజనులు.. వాటిని సేకరించేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. గిరిజనులు సేకరించే ఇప్పపూలను బహిరంగా మార్కెట్లో నేరుగా అమ్ముకునే వీలుండదు.. జీసీసీ ఏర్పాటు చేసిన డీఆర్ డిపోల్లోనే అమ్మాల్సి ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యంతో ఉపాధి కోల్పోయే అవకాశముందని, ఇకనైనా స్పందించి జీసీసీ ద్వారా ప్రత్యేక మద్దతు ధర కల్పించి అటవీ ఉత్పత్తుల సేకరణను ప్రోత్సహించాలని వారు కోరుతున్నారు.