కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కార్యాచరణను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వసతుల కల్పన, వనరుల అభివృద్ధే లక్ష్యంగా గ్రామాల్లో పర్యటించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో కంటే భిన్నంగా ప్రజాప్రతినిధులు, ప్రజలను సంప్రదించి ఎలాంటి పనులు కావాలో అడిగి తెలుసుకొని గుర్తిస్తున్నారు.
జిల్లాలో 40 లక్షల పని దినాలు..
జిల్లాలో 1.23 లక్షల జాబ్ కార్డులుండగా, దాదాపు 2.52 లక్షల మంది కూలీలు ఉన్నారు. 2025-26 సంవత్సరానికిగాను జిల్లాలోని కూలీలందరికీ పనులు కల్పించడంతో పాటు ప్రతి గ్రామంలో అవసరమైన పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 40 లక్షల పని దినాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పారదర్శకత పాటించేలా పనులకు ఎప్పటికప్పుడు జియో ట్యాకింగ్ విధానం అమలు చేయనున్నారు. ప్రతి రోజూ చేపట్టే పనుల్లో పురోగతితో పాటు కూలీల హాజరు నమోదు చేయనున్నారు.
గ్రామాల్లో స్వచ్ఛత, పచ్ఛదనంతో పాటు భూగర్భ జలాలు అభివృద్ధి చెందేలా పనులు చేపట్టనున్నారు. వ్యవసాయ సంబంధమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇంకుడు గుంతలు, పొలాలు చదును చేయడం, కంపోస్టు పిట్లు, పండ్ల తోటలు, పశువుల పాకలు, గొర్రెలషెడ్లు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, నర్సరీల అభివృద్ధి, పాఠశాలల్లో వంటగదులు, చేలల్లో వరద కాలువలవంటివి ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఉపాధి హామీ పనులు చేసే కూలీలు జాబ్‌కార్డు కలిగి ఉండాలని, జాబ్‌కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే వాటిని అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.