స్వాతంత్య్ర దినోత్సవానికి కార్యాలయాలు, పాఠశాలలు, మైదానాలు ముస్తాబయ్యాయి. సోమవారం వేడుకలకు స్టాల్స్, శకటాలను ప్రదర్శించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రజానీకానికి, ప్రముఖులకు వసతులు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాలలో విప్ బాల్క సుమన్, ఆదిలాబాద్‌లో విప్ గంప గోవర్ధన్, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో విప్ సుంకరి రాజు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు.
– మంచిర్యాల, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వాతంత్య్ర దినోత్సవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముస్తాబైంది. జిల్లా కేంద్రాల్లో అద్భుతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, ప్రభుత్వ పథకాలను వివరించే స్టాల్స్‌తోపాటు శకటాలు ప్రదర్శించనున్నారు. నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంచిర్యాల జిల్లా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకలకు విప్ బాల్క సుమన్, ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమానికి విప్ గంప గోవర్ధన్, ఆసిఫాబాద్ కలెక్టరేట్లో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సుంకరి రాజు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతకాలను ఆవిష్కరించనున్నారు.
ముఖ్య అతిథి మొదటగా పతాకావిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం వేదిక మీదకు చేరుకొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా జరుగుతున్న మేలును వివరిస్తారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వ పథకాలను వివరించే స్టాల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మంచిర్యాల జిల్లాలో 13 శకటాలను ప్రదర్శించనున్నారు. అటవీ, వ్యవసాయ, మత్స్య-పశుసంవర్ధక, మిషన్ భగీరథ-ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, మెడికల్ హెల్త్-ఐసీడీఎస్, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖల ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణ, ఆర్అండ్బీ-రెండు పడకల ఇండ్లు, విద్య, పారిశ్రామిక, జిల్లా యువజన సర్వీసులు అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, సంక్షేమ శాఖలు శకటాల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ఇవే కాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో 11 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వేడుకలకు వచ్చే ప్రజానీకానికి కావాల్సిన వసతులు కల్పించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. కాగా.. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ సైనికులు, విద్యార్థులు, యువకులు సోమవారం 75 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.