భీమారం : ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, సిబ్బంది విధులకు సమయానికి హాజరుకావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (Collector Kumar Deepak) సూచించారు. భీమారం మండల కేంద్రంతో పాటు పోలంపల్లి, అర్కపల్లి, అంకుషాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ( పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అకాల వర్షాల దృష్ట్యా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల వద్ద నుంచి నిబంధన ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. సన్న రకం బియ్యాన్ని విక్రయించిన రైతులకు మద్దతు ధరతో రూ. 500 బోనస్ అందిస్తామన్నారు.
అనంతరం కలెక్టర్ తహసీల్ కార్యాలయాన్ని సందర్శించి రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అంశాలను పరిశీలించారు. అర్హులను మాత్రమే గుర్తించాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్, ఎంపీవో సతీష్ రెడ్డి పాల్గొన్నారు.