మందమర్రి, ఏప్రిల్ 26 : చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఎన్నికల హామీలను మరచి అక్రమ దందాలకే పెద్దపీట వేస్తున్నారని, స్వయంగా ఎమ్మెల్యే పీఏ జోరుగా ఇసుక రవాణా సాగిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని శనివారం మందమర్రి పట్టణంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొంగల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మందమర్రికి చేరుకున్న మాజీ విప్ బాల్క సుమన్‌కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి శాలువాలతో సన్మానం చేశారు.
పాతబస్టాండ్ ఏరియాలోని ఆచార్య జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన బైక్ ర్యాలీ ప్రారంభించగా, కోల్‌బెల్ట్ రహదారిపై శాంతినగర్, విద్యానగర్, రామన్ కాలనీ, గాంధీనగర్‌ల మీదుగా సింగరేణి పాఠశాల వరకు చేరుకున్నది. అక్కడ పార్టీ నాయకులతో కలసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాలచెట్టు ఏరియా మీదుగా మార్కెట్ సెంటర్ వరకు కొనసాగిన బైక్ ర్యాలీలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు.
నియోజక వర్గంలోని చెన్నూర్ ప్రాంతంతో పాటు మంథని నియోజక వర్గ పరిధిలోని గోదావరిలో విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వివేక్ బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప.. ఈ 16 నెలల్లో ఒక్క పని కూడా చేసింది లేదన్నారు. నియోజక వర్గంలో సొంత పరిశ్రమలు ఏర్పాటు చేసి 45 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీని మరచి.. మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారని ఆయన విమర్శించారు. రజతోత్సవ సభ అనంతరం జిల్లాలో పార్టీ కమిటీలను వేసి అటు ప్రభుత్వం, ఇటు ఎమ్మెల్యే ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతామన్నారు. చెన్నూర్‌లో తన హయాంలో మంజూరు చేయించిన బస్ డిపో, పామాయిల్ పరిశ్రమలను ఎందుకు రద్దు చేయించారన్నారు.
రజతోత్సవ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ రాజారమేశ్, నాయకులు మేడిపల్లి సంపత్, రాజశేఖర్, బండారు సూరిబాబు, ఎండీ అబ్బాస్, మద్ది శంకర్, భట్టు రాజ్‌కుమార్, తోట సురేందర్, మేడిపల్లి మల్లేశ్, బెల్లం అశోక్, అఖిలేశ్ పాండే, సీపెల్లి సాగర్, పల్లె నర్సింగ్, కనకం రవీందర్, కళ్లిజు అనిల్ కుమార్, ముస్తఫా, మహిళా నాయకులు అమృత రమాదేవి, చిప్పకుర్తి రేఖ, సుగుణ, లలిత, విజయ, శారద పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 26 : నేడు ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ తీశారు. ఐబీ చౌరస్తా నుంచి మొదలైన ర్యాలీ మెయిన్‌రోడ్, మార్కెట్‌రోడ్, బస్టాం డు, బెల్లంపల్లి చౌరస్తాల మీదుగా కొనసాగింది. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ 14 ఏళ్లపాటు సుదీర్ఘంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని కొనియాడారు.
కాగా, రజతోత్సవ సభ సందర్భంగా మంచిర్యాల పట్టణం గులాబీమయమైంది. ప్రధాన కూడళ్లతో పాటు రోడ్లకు ఇరుపక్కలా, ఓవర్‌బ్రిడ్జి, పాతమంచిర్యాల బ్రిడ్జి, రహదారులకు మధ్యన గులాబీ జెండాలు, తోరణాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, నాయకులు గాదెసత్యం, అంకం నరేశ్, బేర సత్యనారాయణ, సందెల వెంకటేశ్, తోట తిరుపతి, కాటంరాజు, మధు, సుధీర్, కర్రు శంకర్, పల్లపు రాజు, పెంట ప్రదీప్, రమేశ్‌యాదవ్ పాల్గొన్నారు.