లక్షెట్టిపేట, అక్టోబర్ 23: ఆర్మూర్ నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు నాలుగు వరుసల హైవే (ఎన్‌హెచ్-63)నిర్మాణానికి గతంలో సర్వే చేపట్టగా ఎట్టకేలకు అధికారు లు భూనిర్వాసితులకు నోటీసులు జారీ చేశా రు. కొందరు నోటీసులు తీసుకోగా మరికొందరు తిరస్కరించారు. గతంలో పలు మార్లు హైవే నిర్మాణం కోసం సర్వే చేస్తున్న అధికా రులను భూనిర్వాసితులు, రైతులు అడ్డుకు న్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు పోలీసు బందోబస్తు మధ్య సర్వే పనులు పూర్తి చేసింది. గత ఆగస్టులో నోటీసులిచ్చేందుకు ప్రయత్నించగా బాధితులు తిరస్కరించారు. భూమిని కాపాడుకునేందుకు బాధితులంతా ఏకమై హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 27 వరకు బాధితుల జోలికి ఎవరూ వెళ్లవద్దని కోర్టు స్టే ఇచ్చింది. కానీ అధికారులు కోర్టు పరిధికి లోబడి భూమిపైకి వెళ్లకుండా తదుపరి ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.
నోటీసులు తిరస్కరించిన బాధితులు
కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారు లు ఈ నెల 22న మండలంలోని పోతపల్లి, మిట్టపల్లి, లక్షెట్టిపేట, గుల్లకోట, ఇటిక్యాల, మోదెల గ్రామాల్లో హైవేలో భూమిని కోల్పోతున్న రైతులను గుర్తించి వాళ్లకు నోటీసుల్వి డం ప్రారంభించారు. తహసీల్దార్ స్వయం గా సిబ్బందితో వెళ్లి పట్టాదారులకు అవగాహన కల్పిస్తూ నోటీసులు అందిస్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా నోటీసులు తీసుకోగా మరికొంత మంది నోటీసులు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నోటీసులను బాధితుల ఇంటి గోడలకు అంటిస్తున్నారు. గతంలో భూములను ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ మార్కెట్ ధరకు కాకుండా తక్కువకే భూమిని ఇవ్వబోమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా ఏకమై బుధవారం తహసీల్ కార్యాలయానికి చేరుకోవడంతో హైవే అథారిటీ అధికారులు, ఎమ్మార్వో బాధితులకు నచ్చజెప్పారు. కొంతమంది రైతులు నోటీసులు తీసుకొని వెళ్లిపోయారు.
మార్కెట్ ధర చెల్లించాలి..
నాకు లక్షెట్టిపేట మున్సిపాలిటీలో సుమారు ఎకరంపైగా వ్యవసాయ భూమి హైవే రోడ్డు నిర్మాణంలో అధికారులు తీసుకునేందుకు ప్ర యత్నిస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలో గుంట భూమి కూడా కొనుక్కునేలా లేదు. మార్కెట్ ధరలు చూస్తే లక్షలు, కోట్లలో పలుకుతున్నది. నాకున్న భూమి ఇండ్ల సమీపంలో ఉండడంతో ధర చాలా ఎక్కువగా పలుకుతున్నది. అధికారులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కాకుండా మార్కెట్లో ఉన్న ధరను అందిస్తే సంతోషంగా ఉంటుంది. ఈ భూములు పోతే మాకు వ్యవసాయం చేసుకునేందుకు భూమి కూడా లేదు. ఎక్కడైనా కూలీ నాలీ చేసుకోవడం తప్పా వేరే దిక్కు లేదు.
-కొట్టె మహేశ్, భూనిర్వాసితుడు, లక్షెట్టిపేట
నోటీసులు తీసుకోకపోతే నష్టపోతారు..
ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు నాలుగు వరుసల హైవే నిర్మాణానికి భూమి కోల్పోతున్న రైతులు తమకు ఇచ్చే నోటీసులు స్వచ్ఛందంగా తీసుకోవాలి. నోటీసులు తీసుకోకుంటే నష్టపోయేది బాధితులే. నోటీసులు తీసుకోని వారి ఇండ్ల గోడలకు నోటీ సులు అంటిస్తున్నాం. నోటీసులు తీసుకున్న ప్రతి ఒక్కరూ పట్టాదారు పాసు పుస్తకం, పాన్ కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ కార్యాలయంలో అందజేయాలి. వాళ్ల భూముల్లో బోరుబావి, షెడ్డు, ఇండ్లు, ప్రహరీతోపాటు చెట్లు, పూల, పండ్ల మొక్కలు ఏవి ఉన్నా వాటి వివరాలు కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా బాధితుడు నష్టపోయేది ఎంతో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.
-దిలీప్ కుమార్, తహసీల్దార్, లక్షెట్టిపేట