ఆదిలాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాకు నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు న్యాయం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. సోమవారం ఆదిలాబాద్లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ సమావేశానికి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ హాజరయ్యారు. కాగా.. జిల్లా నాయకులు తమ ఆగ్రహాన్ని వారి ముందు వ్యక్తం చేశారు.
నామినేటెడ్ పదవుల్లో అధిష్టానం ఆదిలాబాద్ జిల్లాను గుర్తించడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల్లో రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లా నాయకులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. జిల్లా డీసీసీ అధ్యక్షుడితోపాటు ఇతర నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో గ్రామాల్లో రైతుల నుంచి వ్యతిరేకత ఉందని నాయకులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.