నిర్మల్, మే 12(నమస్తే తెలంగాణ) : నిర్మల్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. కాలేజీకి అనుమతినిస్తూ గురువారం సాయంత్రం ఎన్ఎంసీ అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు (ఎన్ఎంసీ) ఎఫ్.నం. ఎన్ఎంసీ/ యూజీ/ 2023-24/ 000039/ 025960 ద్వారా కాలేజీ ఏర్పాటు సహా 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి పూర్తి స్థాయి ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పట్టుబట్టి మరీ జిల్లాకు మెడికల్ కాలేజీని ప్రత్యేకంగా మంజూరు చేయించిన సంగతి తెలిసిందే. వైద్యారోగ్యశాఖ అన్ని అనుమతులతో కూడిన జీవోను కూడా జారీ చేసింది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ మెడికల్ కళాశాలలో తరగతులను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా అనుమతులతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నిర్మల్ శివారులోని భీమన్న గుట్ట ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని మెడికల్ కాలేజీ కోసం ప్రభుత్వం కేటాయించగా, ఇందులో కళాశాల భవనాన్ని నిర్మించేందుకు రూ.40కోట్లను మంజూరు చేసింది. గతేడా ది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, జీ ప్లస్ టూ అంతస్థుల్లో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరంలో తరగతుల నిర్వహణకు ఈ భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ఏడాది క్రితమే మెడికల్ కళాశాల కోసం 23 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను కేటాయించింది. వీరంతా ఇప్పటికే జిల్లా కేంద్ర దవాఖానలో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. కీలకమైన అన్ని ఏర్పాట్లు మొదలుకావడంతో ఇక జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభానికి ముందడుగు పడినట్లేనని చెబుతున్నారు.
రూ.213కోట్లు కేటాయింపు…
కాలేజీ భవన నిర్మాణం కోసం ఇప్పటికే అధికారులు నిర్మల్ శివారులోని భీమన్న గుట్ట ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని గుర్తించి వైద్యారోగ్య శాఖకు కేటాయించారు. ఇక్కడ ప్రస్తుతం రూ. 40కోట్లతో 250 పడకల దవాఖాన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో 50 పడకలు, జిల్లా దవాఖానలో 100 పడకలు మొత్తం 150 పడకలతో ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయి. తాజాగా మరో 30 పడకల కోసం రూ.7 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో జిల్లా ప్రధాన ఆసుపత్రిపై మూడవ అంతస్థులో జరుగుతున్న నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇలా త్వరలోనే జిల్లా కేంద్రంలో మొత్తం 430 పడకలు అందుబాటులోకి రానున్నాయి.
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీని జిల్లాకు మంజూరు చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే జూలై లేదా ఆగస్టులో విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. కొత్త భవనాల నిర్మాణాలు, ఇతర సదుపాయాల కోసం రూ.166 కోట్లు విడుదల చేసింది. ఈవిధంగా వివిధ పనుల కోసం రూ.213 కోట్లు విడుదల కాగా, ఆయా నిధులతో పనులను పూర్తి చేసి ఈ ఏడాది జూలై మాసంలోగా మెడికల్ కాలేజీని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతున్నది.
అందుబాటులోకి కార్పొరేట్ వైద్యం
నిర్మల్ జిల్లా వాసులకు మెడికల్‌కాలేజీ ఏర్పాటుతో కార్పొరేటు స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మెరుగైన వైద్య చికిత్సల కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు పరుగులు పెట్టాల్సి వస్తున్నది. అలాగే జాతీయ రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న కారణంగా వారికి అత్యవసర వైద్య చికిత్సలను అందించలేని పరిస్థితి నెలకొంది.
దీంతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. దీంతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలైన కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం… ఆరోగ్యపరంగానే కాకుండా, ఆర్థిక పరంగా కూడా సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ కృషి వల్లే సాధ్యమైంది..
నిర్మల్ వైద్య కళాశాలకు అనుమతులు రావడం సంతోషకరం. ఇందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. నిర్మల్‌లో మెడికల్ కళాశాల కోసం 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. ఇక్కడ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడి దవాఖానల్లో 450 పడకలు అందుబాటులో ఉండాలన్న కేంద్రం ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు చేపట్టాం. ఎంసీహెచ్‌లో 150, జిల్లా దవాఖానలో 300 పడకలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన నిధులను కేటాయించి, నిర్మాణాలను చేపట్టాం.
-అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర అటవీ,పర్యావరణ మంత్రి
ఈ ఏడాది నుంచే తరగతులు..
నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి ఎన్ఎంసీ నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చాయి. ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్స రంలో వంద మందికి అడ్మిషన్లు ఇవ్వబో తున్నాం. కళాశాల భవన పనులు కొనసా గుతున్నాయి. రెండు నెలల్లో పూర్తవు తాయి. ఆగస్టు నాటికి కొత్త భవనంలో తరగతులు ప్రారంభిస్తాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూస్తాం..
– జడ్.వీ.ఎస్. ప్రసాద్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, నిర్మల్
సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయి..
జిల్లాకు మెడికల్ కాలేజీ రావడంతో ఈ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడింది. వివిధ విభాగాల సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే 350కి పైగా పడకలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ముం దుగా అనుకున్నట్లుగానే సకాలంలో అన్ని అనుమతులు రావడం చాలా సంతోషాన్నిచ్చింది. కృషి చేసిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు..
-డాక్టర్ ఏ దేవేందర్‌రెడ్డి, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్