కుంటాల : మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు ప్రభుత్వ ప్రోత్సహకాలను అందిపుచ్చుకుని వ్యవసాయ రంగంలో రాణించాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం కుంటాల మండల కేంద్రంలో రూర్బన్ పథకం ద్వారా మంజూరైన వరి కోత యంత్రాలను మహిళా సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనేక రాయితీలు అందజేస్తుందన్నారు. ఎరువులతో పాటు రైతు బంధు, రైతు బీమా, పంటలకు మద్దతు ధర కల్పించి రైతాంగాన్ని అన్ని విధాలుగా
ప్రోత్సహిస్తుందన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాతో సాగు విస్తీర్ణం పెరిగి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పాడి పంటలకు నిలయంగా మారిందన్నారు. మహిళలు ఆధునిక వ్యవసాయంవైపు అడుగులు వేసి పురుషులతో సమానంగా లాభాలు గడించాలన్నారు. కుంటాల మండలంలో సమస్యల పరిష్కారానికి దశలవారీగా కృషి చేస్తానన్నారు. భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు.
రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీపీ గజ్జారాం, జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, ఎంఎస్ అధ్యక్షురాలు గోనె లక్ష్మి, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆర్బీఎస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేశ్, ఏఎంసీ డైరెక్టర్ భోజన్న, సబ్బిడి గజేంధర్, ఆత్మ డైరెక్టర్లు భూమన్న, దశరత్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు జి. ప్రకాష్ గౌడ్, జె. మహేందర్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.