దస్తురాబాద్, నవంబర్ 28 : 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి వార్షిక ఫలితాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర విద్యాశాఖ కృషి చేస్తున్నది. 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా దాదాపు 85 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. నవంబర్ 9వ తేదీ నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. ఉపాధ్యాయులు విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా నైపుణ్యాన్ని పెంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఉత్తమ ఫలితాలతో పాటు అత్యధిక మార్కులు సాధించేలా తరగతులు బోధిస్తున్నారు. వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధపెట్టి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం సిలబస్ పూర్తి కాగా, డిసెంబర్ నెలాఖరు వరకు 100 శాతం సిలబస్ పూర్తయ్యేలా ముందుకు సాగుతున్నారు. గత విద్యా సంవత్సరంలో వెల్లడించిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లా రెండో స్థానంలో ఉండగా, దస్తురాబాద్ మండలంలో 8వ స్థానంలో ఉంది.
ప్రత్యేక తరగతులు, పరీక్షలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 9వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఉదయం 8.30నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకో సబ్జెక్టులో ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 100 శాతం మెరుగైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్కు, రోజూ వారీ టెస్టులు నిర్వహిస్తున్నారు. జనవరిలో సబ్జెక్టుల వారీగా గ్రాండ్ టెస్టులు, స్లిప్ టెస్టులు, ఇక మార్చిలో ప్రిఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మండలంలో రెండు జడ్పీ ఉన్నత పాఠశాలలు, రెండు బాలికల, బాలుర ఆశ్రమ, కేజీబీవీ పాఠశాలలు ఉండగా, మొత్తం 155 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
వెనుకబడిన విద్యార్థులపై దృష్టి
రాష్ట్ర విద్యాశాఖ ఈ నెల 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. వందశాతం ఫలితాలు సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. పకడ్బందీగా తరగతులు నిర్వహిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సబ్జెక్టుల వారీగా అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సిలబస్ ప్రకారం బోధన చేపట్టి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం.
– శేఖర్‌రెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం, జడ్పీ ఉన్నత పాఠశాల, మున్యాల
సందేహాలను నివృత్తి చేసుకుంటున్నాం
సబ్జెక్టుల్లో తలెత్తే సందేహాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక తరగతుల్లో ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేస్తుకుంటున్నాం. రోజుకో సబ్జెక్టు బోధిస్తున్నారు. అర్థంకానివి, కఠినంగా ఉండే అంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటున్నాం. ప్రత్యేక తరగతులతో అన్ని పాఠ్యాంశాలపై పట్టు పెంచుకునే అవకాశం కలిగింది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి టెస్టులు పెడుతున్నారు. కష్టపడి చదివి పదికి పది జీపీఏ తెచ్చుకుంట. – స్రవంతి, విద్యార్థి