సారంగాపూర్, మే 27: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తరుగు తీయకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండలంలోని ధని గ్రామం వద్ద స్వర్ణ- నిర్మల్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని ఐకెపి సెంటర్ నిర్వాహకులు త్వరితగతిన కొనుగోలు చేయకపోవడంతో విక్రయానికి తీసుకువచ్చిన వరి ధాన్యం నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే లారీల కొరత మూలంగా ధాన్యం రైస్ మిల్లులకు తరలించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
కష్టపడి అప్పు సప్పుచేసి పంట పండిస్తే కొనుగోలు కేంద్రంలో సెంటర్ నిర్వాహకుల అలసత్వం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. రైతులు నష్టపోతే పంటకు చేసిన అప్పులు ఎలా తీరుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తడిచిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గంటపాటు ధర్నా, రాస్తారోకో చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ధర్నా చేస్తున్నారన్న విషయం తెలియడంతో ఎస్సై శ్రీకాంత్ ధని గ్రామానికి చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నాను శాంతింప చేశారు. అలాగే సెంటర్ నిర్వాహకులతో మాట్లాడి ధర్నాను విరమించారు.