కార్పొరేట్ తరహా భవనాలు.. నాణ్యమైన ఉచిత విద్య
వసతి గృహాల సీట్లకూ పెరిగిన పోటీ.. పిల్లలకు కోచింగ్
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడులకు విద్యార్థుల వలస
తమ పిల్లలను సైతం చేర్చి ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు
ఈ యేడాది నిర్మల్ జిల్లాలో 6070 మంది చేరిక
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 29 : ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న సర్కారు, అందుకనుగుణంగా నిధులు కేటాయిస్తున్నది. కార్పొరేట్ తరహాలో.. గవర్నమెంట్ స్కూళ్లలో అత్యాధునిక భవనాలు నిర్మించి, సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. పైసా ఖర్చు లేకుండా మెరుగైన విద్యనందిస్తుండగా, ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నిర్మల్ జిల్లాలో 6070 మంది చేరగా, మున్ముందు వారి సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నది. మరోవైపు ఉపాధ్యాయులు సైతం తాము బోధించే విద్యాలయాల్లోనే తమ పిల్లలను చేర్పించి ఆదర్శంగా నిలుస్తుండగా, అన్ని వర్గాల్లోనూ ఆసక్తి పెరుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల బలోపేతం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తుండగా, పూర్వవైభవం వస్తున్నది. సీమాంధ్ర పాలనలో పట్టింపులేని తనంతో భవనాలన్నీ శిథిలమై పోగా, తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో కోట్లాది నిధులను పాఠశాలలకు ఖర్చు చేస్తుండగా, సమస్య లు పరిష్కారమవుతున్నాయి. కార్పొరేట్ తరహాలో భవనాలు నిర్మిస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం చదువులపై ప్రత్యేక శ్రద్ధతో ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతున్నది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యనందిస్తుండడంతో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు క్యూ కడుతున్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లించేకన్నా.. పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య అందుతుందని భావించి తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ పాఠశాలల నుంచి 6070 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరడం గమనార్హం. మున్ముందు వీరి సంఖ్య రెట్టింపు స్థాయికి చేరుకునే అవకాశమున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ఇప్పటి నుంచే విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
6070 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరిక
నిర్మల్ జిల్లాలో మొత్తం 862 పాఠశాలలుండగా, ఇందులో ఉన్నత పాఠశాలలు 162, ప్రాథమికోన్నత పాఠశాలలు 102, ప్రాథమిక పాఠశాలలు 598 ఉన్నాయి. ఇందులో ఇటీవల ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు 6,157 మంది విద్యార్థులు వలస వచ్చారు. ప్రాథమిక పాఠశాలలో 4,540 మంది విద్యార్థులు చేరగా, ప్రాథమికోన్నత పాఠశాలలో 1,264 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాలలో 266 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల బాట పట్టారు. ఇందులో తరగతుల వారీగా చూస్తే ఒకటో తరగతిలో 1600 మంది విద్యార్థులు, రెండో తరగతిలో 950, మూడో తరగతిలో 783, నాలుగో తరగతిలో 661, ఐదో తరగతిలో 546, ఆరో తరగతిలో 1093, ఏడో తరగతిలో 171, ఎనిమిదో తరగతిలో 174, తొమ్మిదో తరగతిలో 92 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.
వసతి గృహాల బడులకు పెరిగిన పోటీ..
ప్రభుత్వ బడులతో పాటు ప్రభుత్వ వసతి గృహాల్లో (గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్ ఇతర పాఠశాలల) ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు తీవ్ర పోటీ నెలకొంది. విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షలో సీటు సాధించినట్లయితే భవిష్యత్‌కు బంగారు బాటలు పడుతాయన్న ఉద్దేశంతో తమ పిల్లలను ఏడాది పాటు కోచింగ్‌కు పంపిస్తున్నారు. కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు మాత్రమే సీట్లు దక్కుతున్నాయి. ఒక్కో సీటుకు 100 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారంటే సర్కారు విద్య ఎంత బలోపేతమైందో అర్థం చేసుకోవచ్చు.
సర్కారు స్కూళ్లకు పూర్వ వైభవం
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను అదే పాఠశాలల్లో చదివించడం మంచి మార్పునకు నిదర్శనం. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలి. ఆ దిశగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలి.
మా బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం
మాది కుంటాల. మేము కూడా చిన్నతనంలో ప్రభుత్వ పాఠశాల ల్లోనే చదివాము. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాం. మాలాగే మా పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాము. మా కూతురు శాట్ల ధన్వి ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది. 2019-20లో గురుకుల ప్రవేశ పరీక్షలో 70వ ర్యాంక్ వచ్చింది. 2020-21 మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం నిర్వహిం చిన పరీక్షలో జిల్లా స్థాయి మొదటి ర్యాంకు వచ్చింది. – శాట్ల శ్రావణ్-సంగీత, కుంటాల