నిర్మల్ అర్బన్, డిసెంబర్ 18 : నిర్మల్ పట్టణవాసులకు నిరంతరం మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన నీరు సరఫరా అవుతోంది. నిర్మల్ జిల్లాలో 692 గ్రామాల పరిధిలోని 5.45 లక్షల మందికి తాగునీటి కోసం ప్రభుత్వం రూ.1,318 కోట్లతో ఇంటెక్ వెల్స్, పైప్‌లైన్ నిర్మాణాలను పూర్తి చేసి నీరు అందిస్తున్నది. 2003 సంవత్సరంలో నిర్మల్ పట్టణవాసుల దాహార్తిని తీర్చేందుకు అప్పటి ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి రూ.32 కోట్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నిర్మల్ వరకు పైప్‌లైన్ వేయించారు. అనంతరం రూ.39.91 కోట్లతో పైప్‌లైన్ పనులను అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రారంభింపజేశారు. నిర్మల్ పట్టణంలో 117 కిలోమీటర్ల మిషన్ భగీరథ తాగునీటి పైప్‌లైన్ వేయించి 42 వార్డుల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు.
మిషన్ భగీరథ నీటిని 42 వార్డుల ప్రజలకు అందించడానికి తొమ్మిది వార్డుల చొప్పున ఐదు ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించారు. ఒక్కొక్కటి 39 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఐదు ట్యాంకులతో నీటిని సరఫరా చేస్తున్నారు. గాంధీపార్కులో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో రూ.1.45 కోట్లతో నిర్మించిన ట్యాంకును ప్రారంభించారు. ఈ ట్యాంకు ద్వారా 11.20 కిలో మీటర్ల పరిధిలోని 10 వార్డు(శరద్ మహల్, బాగులవాడ, మోతి నగర్, నటరాజ్‌నగర్, బాగ్యనగర్, ఇందిరానగర్, మదీన కాలనీ, ప్రియదర్శినినగర్, జోహ్రనగర్, కళానగర్ కాలనీ)ల ప్రజలకు నీటిని అందిస్తున్నారు.
అలాగే మిగతా నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు 12 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఇసురాళ్ల గుట్ట, ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంతో విశ్వనాథ్‌పేట్, ఆరు లక్షల లీటర్ల సామర్థ్యంతో శాంతినగర్‌తో నిర్మించి వీటి ద్వారా నిరంతరం నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రియదర్శిని నగర్-సారగ్ కాలనీలో ట్యాంకు నిర్మాణం పూర్తికాగా.. నీటిని సరఫరా చేయాల్సి ఉంది.
నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, సారంగాపూర్, దిలావర్పూర్, నర్సపూర్ మండలాల్లోని 213 ఆవాసాలకు రూ.300 కోట్లతో పరిశుభ్రమైన తాగునీటిని ఇంటింటికీ అందిస్తున్నారు. ఇండ్లతోపాటు రైతు వేదికలకు, వైకుంఠధామాలకు, ప్రభుత్వ పాఠశాలలకు, వసతి గృహాలకు, అంగన్వాడీ కేంద్రాలకు స్వచ్ఛమైన జలం అందుతోంది.
మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ పనులతో పట్టణ ప్రజలకు రానున్న 30 సంవత్సరాల వరకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. పట్టణ ప్రజలకు రెండు వైపులా నీరు రానుంది. 2003 సంవత్సరంలో పోచంపాడు నుంచి సిద్ధాపూర్ వరకు వేసిన పైప్‌లైన్ మార్గం ద్వారా, మాటెగాం నుంచి ఇసురాళ్ల గుట్ట వరకు నీరు రాగా వాటిని ఐదు ఓవర్ హెడ్ ట్యాంకులలో నింపి పట్టణంలోని 207 కిలో మీటర్ల వరకు వేసిన పైప్‌లైన్ ద్వారా 20,497 కుటుంబాలకు నీటిని అందిస్తున్నారు. పట్టణ ప్రజలకు తాగునీటిలో ఇబ్బందులు తలెత్తితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా తాగునీటిని అందించేందుకు ముందస్తుగా చర్యలు చేపట్టారు.