బాసర, మార్చి 18 : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని తేజస్విని మృతిపై ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మంగళవారం రాత్రి నుంచి అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట ఆందోళన చేస్తున్నారు. రాత్రంతా కొనసాగిన ఈ ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం ట్రిపుల్ ఐటీకి చేరుకున్న నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల విద్యార్థులను సముదాయించడానికి ప్రయత్నించారు. కాగా.. విద్యార్థినులపై ఎస్పీ జానకీ షర్మి ల్ దుర్భాషలాడిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది. విద్యార్థినులను ఎస్పీ దుర్భాషలాడుతున్నట్లుగా ఉన్న ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న తమపై ఎస్పీ ఈ విధంగా ప్రవర్తించడం సమంజసం కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మల్ అర్బన్, మార్చి 18 ః బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను పోలీసులు దూషించారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు అవాస్తవమని నిర్మల్ పోలీస్‌శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వినిపిస్తున్న వాయిస్ పూర్తిగా అబద్ధం. ఆ వీడియోలో ఉన్న వాయిస్ మార్పింగ్ చేసి తప్పుదారి పట్టించేలా కావాలని రూపొందించబడిందని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇలా మార్పింగ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, వైరల్ చేయడం చట్టపరంగా శిక్షార్హమని తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి అసత్య ప్రచారాలు పోత్సహించొద్దని పోలీసులు హెచ్చరించారు.