నిర్మల్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన న్యూరో వైద్యులు డాక్టర్ బీఎల్ నరసింహారెడ్డి అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ ఐరన్ మ్యాన్ టైటిల్ పో టీల్లో విజేతగా నిలిచారు. ఆదివారం గోవాలో నిర్వహించిన అం తర్జాతీయ పోటీల్లో 64 దేశాలకు చెందిన అభ్యర్థులు పోటీల్లో పాల్గొన్నారు. కేవలం ఎనిమిది గంటల వ్యవధిలో 70.3 మైళ్ల లక్ష్య సాధనతో నిర్వహించిన ఈ పోటీల్లో నరసింహారెడ్డి విజేతగా నిలిచి తెలంగాణ కీర్తిని నిలబెట్టారు. తెలంగాణ నుంచి తొమ్మిది మంది మాత్రమే ఈ పోటీల్లో పాల్గొన్నారు.
నరసింహారెడ్డి నిర్మల్ సైకిల్ క్లబ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే పలు దేశా ల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. గతంలో 200 కిలోమీటర్ల సైకిల్ మారథాన్లో తన రికార్డు భద్రం చేసుకున్నారు. తాజాగా ఆదివారం గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఐరన్ మ్యాన్ పోటీల్లో పాల్గొన్నారు. అరేబియా సమద్రంలో 1.9 కి లోమీటర్ల ఈత పోటీల్లో పాల్గొని టైటిల్ సొంతం చేసుకున్నాడు. 1.10 గంటల్లో రెండు కిలోమీటర్ల ఈతతో పాటు, 3.45 గంటల్లో 90 కిలోమీటర్ల సైక్లింగ్, 2.45 గంటల్లో 21 కిలోమీటర్ల రన్నింగ్ పోటీల్లోనూ విజయం సాధించారు. నరసింహారెడ్డిని నిర్మల్ వైద్యులతోపాటు స్థానిక ప్రముఖులు, జిల్లా వాసులు అభినందించారు.
ఆరు నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్నా..: డాక్టర్ నరసింహారెడ్డి
దాదాపు ఆరు నెలలుగా నిర్మల్తోపాటు చెరువుల్లో ఈత ప్రాక్టీసు చేశానని, సైక్లింగ్, రన్నింగ్ విషయంలోనూ నిర్వాహకులు నిర్ధేశించిన సమయానికి ముందే పూర్తి చేసినట్లు నరసింహారెడ్డి తెలిపారు. సైక్లింగ్, రన్నింగ్ పెద్దగా కష్టం కాలేదని, అరేబియా సముద్రంలో బలమైన అలలతోపాటు రూట్ మ్యాప్ విషయంలో నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం సుసాధ్యం చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ఐరన్ మ్యాన్ టైటిల్ పొందడం సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు.