నర్సాపూర్(జీ), నవంబర్ 3 : సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని, ఆయనే మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్(జీ) మండలంలో శుక్రవారం మంత్రి అల్లోల విస్తృతంగా పర్యటించారు. తెంబుర్ని, అంజనితండా, కుస్లి గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆయనకు వీర తిలకం దిద్దారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
ప్రతీ తండాను గ్రామ పంచాయతీగా చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్ సిలిండర్‌ను రూ.400కే అందజేస్తామని తెలిపారు. రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నరకం బియ్యం అందిస్తామన్నారు. రైతుబందు, ఆసరా పింఛన్లు పెంచుతామని వివరించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను కోరారు. బీజేపీకి కులమత రాజకీయాలపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ తరహా పథకాలు అమలవుతున్నాయా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. అక్రమంగా సంపాధించిన డబ్బుతో ప్రజలను ప్రలోబాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తెంబుర్ని గ్రామంలో ఎన్నికల ప్రచారానికి ముందు శివాలయంలో మంత్రి పూజలు నిర్వహించారు. భీమన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. నర్సాపూర్ (జీ)లో బీఆర్ఎస్ మైనార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
అంజనితండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాథోడ్ గంగారాం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. నర్సాపూర్‌లో పలువురు మైనార్టీ యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్న రామయ్య, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు కోండ్ర రమేశ్, సర్పంచ్ రాంరెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్, గోపిడి గంగారెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు ఫసి మజార్, ఎండీ జాబిర్, బర్కుంట గంగారాం, అయిటి మహేశ్, అమరేందర్, గంగారం, సుధాన్, ప్రవీణ్, నడిపొల్ల రవి, నవీస్, సర్పంచ్ భూమేశ్, ఉప సర్పంచ్ సంతోష్, తండా సర్పంచ్ అంజనాబాయ్, శ్రీనివాస్, నర్సాపూర్ ఉప సర్పంచ్ సాయిచందర్, మహిళలు పాల్గొన్నారు.