నిర్మల్ చైన్గేట్, మార్చి 1: రోగులకు మెరుగైన సేవలందించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని బస్తీ దవాఖానను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని రికార్డులు, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువలోకి తీసుకొచ్చేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందన్నారు. ఉచిత వైద్యం కోసం దూరం వెళ్లే శ్రమ లేకుండా ప్రజల ఆవాసాల మధ్యలోనే దవాఖానలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ దవాఖానలో అవుట్ పేషెంట్ సేవలు, స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స, టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరంగా కౌన్సెలింగ్ తదితర సేవలు అందిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బస్తీ దవాఖాన కోసం స్థల పరిశీలన
భైంసా, మార్చి, 1 : పట్టణంలో బస్తీ దవాఖాన కోసం స్థలాన్ని కలెక్టర్ వరుణ్రెడ్డి బుధవారం పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయం పక్కన గల ఐకేపీ కార్యాలయం తదితర స్థలాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించారు. కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, డా. మతీన్, ఎంఐఎం నాయకుడు ఇర్ఫాన్ ఉన్నారు.
పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
నిర్మల్ అర్బన్, మార్చి 1 : ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించి అన్ని పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతతో పాటు 10 జీపీఏ సాధించేలా కృషి చేయాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ చూపాలని తెలిపారు. ఉత్తీర్ణత శాతం తగ్గితే సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లు బాధ్యులవుతారని హెచ్చరించారు. విద్యార్థులకు పదో తరగతి తర్వాత ఎలాంటి విద్యావకాశాలుంటాయో తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో డాక్టర్ రవీందర్రెడ్డి, విద్యాశాఖ అధికారులు తదితరులున్నారు.
ఈవీఎం గోదాముల పరిశీలన
నిర్మల్ టౌన్, మార్చి 1: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీ ప్యాట్స్ భద్రపరిచే గోదాంను కలెక్టర్ వరుణ్రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని, గోదాం పరిసరాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, భద్రతపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ ఆర్డీవో స్రవంతి, ఎన్నికల డీటీ, అధికారులున్నారు.