నిర్మల్ టౌన్, ఏప్రిల్ 29 : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో ఈ ఏడాది 80 వేల ఎకరాల్లో మక్క సాగు అయినట్లు అధికారులు తెలిపారు. మక్కకు మార్కెట్లో ధర లేకపోవడంతో ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. మక్కజొన్న క్వింటాలుకు రూ. 1962 ధర ప్రకటించిన నేపథ్యంలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ముథోల్ మండల కేంద్రంలో సోమవారం కొనుగోళ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 30 మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయలు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, మార్క్‌ఫెడ్ మేనేజర్ గౌరీశంకర్, జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్‌అహ్మద్ పాల్గొన్నారు.
పశు సంవర్ధకశాఖ పథకాలను అర్హులకు చేర్చాలి
పశు సంవర్ధకశాఖ ద్వారా అమలవుతున్న పథకాలు పాడి రైతులకు చేరేలా అధికారులు కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వరల్డ్ వెటర్నరీ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధకశాఖలో సుదీర్ఘకాలం పనిచేసి రిటైరైన నారాయణరెడ్డి, ప్రభాకర్, గజ్జారాంలను సన్మానించారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పశు సంవర్ధకశాఖ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా చూసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల వద్దకు చేర్చి పశు పోషణ వృద్ధి చెందేలా చూడాలన్నారు.
డాక్టర్‌కు సన్మానం…
రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టు కింద చించోలి (బి)కోతుల పునారావాస కేంద్రంలో సేవలందిస్తున్న డాక్టర్ శ్రీకర్రాజ్ను కలెక్టర్ అభినందించారు. జిల్లాలో కోతుల బెడదను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోతుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కోతులను నియంత్రించేందుకు శ్రీకర్రాజ్ సేవలను గుర్తించి ఈ సన్మానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా పశు సంవర్దకశాఖ అధికారి శంకర్, ఏడీ సురేశ్, డీఆర్డీవో విజయలక్ష్మి తదితరులున్నారు.
కలెక్టరేట్ పనులను పూర్తి చేయాలి
జిల్లా కేంద్రంలోని ఎల్లపెల్లి శివారులో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను వారంలోగా పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దాలని, కార్యాలయ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా మిగిలిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 90శాతం పనులు పూర్తయినందున మిగిలిన పది శాతం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ సుభాష్‌చందర్, ఆర్అండ్బీ అశోక్, అధికారులు శంకరయ్య, రాథోడ్ శ్యాంరావు పాల్గొన్నారు.
వేసవి శిబిరాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి
వేసవి శిబిరాలను ప్రణాళికబద్దంగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.మే 1 నుంచి 31 వరకు నిర్మల్ జిల్లాలోఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేసవి శిక్షణ తరగతుల నిర్వహణపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అథ్లెటిక్, వివిధ పోటీలతో పాటు అక్కడ వసతులు కూడా కల్పించాలని అధికారులకు సూచించారు. క్రీడాకారులకు కావాల్సిన ఆట సామగ్రి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్‌రెడ్డి, డీపీవో శ్రీలత, డీఆర్డీవో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.