సోన్, మార్చి 3 : సోన్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల చిన్నారుల చురుకుదనాన్ని చూసి నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి మెచ్చుకున్నారు. బోర్డుపై ఉన్న పదాలను ఓ చిన్నారి చకాచకా చదివి చెప్పడంతో వెరీగుడ్ అంటూ కలెక్టర్ ప్రశంసించారు. మిగతా పిల్లలు కూడా ఇలాగే చదవాలంటూ విద్యార్థులను అభినందించడంతో అక్కడ ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో టెన్షన్ పోయి ఆనందం వ్యక్తమైంది. సోన్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ వరుణ్‌రెడ్డి శుక్రవారం సందర్శిం చారు.
పది నిమిషాల పాటు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో అన్ని విషయాలపై మాట్లాడారు. అనంతరం పక్కన ఉన్న ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి గదిలోకి వెళ్లారు. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ సూచించారు. మన ఊరు- మన బడి కింద ఇప్పటివరకు చేపట్టిన పనులు, ఇంకా మిగిలిపోయిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంటశాలను సందర్శించి అక్కడ మధ్యాహ్న భోజనం మెనూను అడిగి తెలుసుకున్నారు. మంచి భోజనం అందిస్తున్నారని విద్యార్థులు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజు స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నారా? మార్కులు ఎలా వస్తున్నాయి.. సాయంత్రం వేళ స్నాక్స్ ఇస్తున్నారా అని ఆరా తీశారు. అంతకుముందు సాకెర గ్రామంలో పల్లె ప్రగతి కింద చేపట్టిన పనులను పరిశీలించారు. పనుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పీహెచ్సీలో మెరుగైన వైద్యం అందించినప్పుడే సర్కారు వైద్యశాలలపై భరోసా ఏర్పడుతుందని, ఆ దిశగా వైద్యులు, సిబ్బంది కష్టపడి పనిచేయాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. సోన్ పీహెచ్‌సీని తనిఖీ చేశారు. పీహెచ్సీలో ఓపీతో పాటు ఇన్‌పేషెంట్ల రికార్డులను పరిశీలించారు. అక్కడి వైద్యులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. పీహెచ్సీ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందని, సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ హిమబిందు, వైద్యులు శ్రీనివాస్, ఎంపీడీవో ఉషారాణి, హెచ్ఎం గజ్జారాం, సోన్, సాకెర సర్పంచ్‌లు వినోద్, సుంచు సుప్రజ, ఏపీవో మంజుల తదితరులున్నారు.