నిర్మల్ చైన్గేట్, నవంబర్, 22 : గర్భస్థ మహిళల మరణాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బందిని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గర్భస్థ మరణాలు నివారించడంపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వైద్య శాఖ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గర్భస్థ మహిళల మరణాలు నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే గర్భస్థ మహిళల మరణాలను నియంత్రించేందుకు జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్వో రాజేందర్, వైద్యాధికారులు సురేశ్, శ్రీనివాస్, సౌమ్య, అధికారులు ఉన్నారు.
నిర్మల్ అర్బన్, నవంబర్ 22 : గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానవంతులు కావాలని యువతకు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచి, వసతులు కల్పించాలన్నారు. సమయపాలన పాటిస్తూ ప్రణాళిక ప్రకారం చదవాలని పోటీ పరీక్షల అభ్యర్థులకు సూచించారు. ఆమె వెంట నిర్మల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, తహసీల్దార్ రాజు అధికారులు మోహన్ సింగ్, విజయశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.