ఆదిలాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి-353(బీ) నిర్మాణ పనులు రైతులతోపాటు వాహనదారులకు శాపంగా మారాయి. మహారాష్ట్ర సరిహద్దు ఉపాసనాల నుంచి భోరజ్ జాతీయ రహదారి-44 ను కలిపేలా ఈ పనులు జరుగుతున్నాయి. జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు నుంచి జైనథ్, బేల, భోరజ్ మండలాల మీదుగా 33 కిలో మీటర్లు.. ప్రస్తుతం ఉన్న ఏడు మీటర్ల రోడ్డును 10 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. రాష్ట్ర రహదారులు అండ్ భవనాల శాఖ(నేషనల్ హైవే) విభాగం అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తుండగా నత్తనడకన సాగుతున్నాయి. ఎనిమిది నెలల కిందట ప్రారంభమైన పనులు 2026 మే లోగా పూర్తి కావాల్సి ఉండగా.. రహదారి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ర్యాంపులు నిర్మించాలి..
రెండు వరుసల రోడ్డు వెడల్పులో భాగంగా వంతెనలు, వర్షపు నీరు వెళ్లడానికి రహదారికి ఇరువైపులా కాలువలు నిర్మిస్తున్నారు. రైతుల భూములకు ఆనుకుని డ్రెయిన్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. దాదాపు మీటరు వెడల్పుతో నిర్మిస్తున్న కాలువల కారణంగా రైతులు తమ భూముల్లోకి పోవడానికి దారి లేకుండా పోతుంది. వ్యవసాయ పనులు చేసుకోవాలంటే రైతులు వెడల్పుగా ఉన్న డ్రెయిన్లు దాటి పోవాల్సి వస్తుంది. డ్రెయిన్ నిర్మించిన చోట ర్యాంపులు ఏర్పాటు చేయకపోవడంతో తమ పొలాలకు ఎలా పోవాలి? వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు స్పందించి తమ పొలాలకు పోయేలా తోవ ఏర్పాటు చేయాలని రైతులు కోరినా ఫలితం లేదంటున్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న వంతెన కారణంగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. గతంలో ఉన్న వంతెనలు కూల్చి కొత్తవి నిర్మిస్తుండడంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక నీరంతా పొలాల్లో నిలుస్తుంది. ఈ నీటిని తీసివేయడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాత బ్రిడ్జిలతోపాటు రోడ్లపై పలు చోట్ల కంకర తేలి ప్రమాదకరంగా మారాయి. వేగంగా వచ్చే వాహనాలు తెలిన కంకరతో స్లిప్ అవుతున్నాయని వాహనదారులు అంటున్నారు. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాత్కాలిక వంతెన వద్ద ప్రమాదాలు
భోరజ్ మండలంలోని తర్నం వద్ద వంతెన కుంగిపోవడంతో కొత్త వంతెన నిర్మిస్తున్నారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా రూ.4.50 కోట్లతో తాత్కాలిక వంతెన నిర్మించారు. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా వంతెనను నిర్మించాల్సి ఉండగా అధికారులు తక్కువ ఎత్తులో పైపులు వేసి నిర్మాణం చేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఈ వంతెన మీదుగా నీరు ప్రవహించి రాకపోకలు నిలిచాయి. ఇటీవల నీటి ప్రవాహంలో మోటార్ సైకిల్‌పై వంతెన దాటడానికి ప్రయత్నించిన జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్‌కు చెందిన యువకుడు కొట్టుకుపోయాడు. తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. భారీ వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిపై చిన్నపాటి వర్షాలకే నీరు ప్రవహిస్తుందని, తాత్కాలిక బ్రిడ్జి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వాహనదారులు అంటున్నారు.