మంచిర్యాల, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సభకు నాయకులు, కార్యకర్తలతోపాటు వేలాది మంది తెలంగాణవాదులు, ఉద్యమ సానుభూతిపరులు, కేసీఆర్ కేటీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
ఇతర పార్టీలకు భిన్నంగా వరంగల్ తరలి వెళ్లేందుకు చాలామంది స్వచ్ఛందంగా ముందుకు రావడంపై బీఆర్ఎస్పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్న సంకేతాలు కనిపించాయి. చాలా మంది పార్టీ కార్యకర్తలు రజతోత్సవ సభలో పాల్గొనేందుకు తమ సొంత వాహనాల్లో వెళ్లి కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిగా తరలి వచ్చిన ఈ సభలో పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ చేసిన ప్రసంగం అందరిని ఎంతగానో ఆకట్టుకున్నది. కేసీఆర్ దిశానిర్ధేశంతో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నేతలంతా సిద్ధమవుతుతున్నారు.
ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో లక్షలాదిగా జనం తరలిరావడంతో అధికార కాంగ్రెస్‌తోపాటు బీజేపీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది వరంగల్‌కు తరలివెళ్లడాన్ని ఇక్కడి ఆ రెండు పార్టీల నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఎంతమంది వెళ్లారనే దానిపై తమ అనుచరులతో ఆరా తీసినట్లు తెలిసింది. రజతోత్సవ సభలో కాంగ్రేస్, బీజేపీలపై కేసీఆర్ చేసిన విమర్శల దాడితో పాటు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అసలు రంగును బయట పెట్టడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
సభ కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ కావడం, ప్రజలు టీవీలు, సెల్ఫన్లకు అతుక్కుపోయి కేసీఆర్ స్పీచ్‌ను ఆసక్తిగా వినడంపై కాంగ్రెస్, బీజేపీలు సమీక్షించుకుంటున్నట్లు సమాచారం. ఆయా పార్టీల ముఖ్య నాయకులు గ్రామీణ స్థాయిలో సభకు వెళ్లిన వారి వివరాలను ఆరా తీస్తుండడం గమనార్హం. ముఖ్యంగా బీఆర్ఎస్ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే అభిప్రాయ బేధాలు, గ్రూపు తగాదాలు, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ సభ సక్సెస్‌ను జీర్ణించుకోలేకపోతున్నాయి ఊపిరి పోసిన కేసీఆర్ ప్రసంగం ఎల్కతుర్తి బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు గంటకు పైగా ప్రసంగించిన తీరు బీఆర్ఎస్ కేడర్‌లో ఊపునిచ్చింది.
ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రాధాన్యతను వివరించడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు. బీజేపీ వైఖరిపైనా ఆయన దుమ్మెత్తి పోశారు. ఈ రెండు పార్టీలపై కేసీఆర్ చేసిన విమర్శలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. కేసీఆర్ మాటలకు బహిరంగ సభ ప్రాంగణం చప్పట్లతో మారుమోగి పోయింది. ఆ బహిరంగ సభ దృశ్యాలను టీవీల్లో చూసిన సాధారణ ప్రజలు కేసీఆర్ ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారు.
ఎల్కతుర్తి సభ స్ఫూర్తి నింపింది
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 28 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ పార్టీశ్రేణులు, ప్రజల్లో స్ఫూర్తి నింపింది. కనీవినీ ఎరుగని రీతిలో సాగిన ఈ సభతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింది. ప్రజలకు ఈ రజతోత్సవ సభ ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. తమవెంట బీఆర్ఎస్ పార్టీ ఉందని, కేసీఆర్ ఉన్నాడన్న నమ్మకాన్ని ఈ సభ ద్వారా ప్రజానీకానికి తెలియజెప్పారు. ప్రస్తుతం ప్రజలంతా బీఆర్ఎస్నే కోరుకుంటున్నారు.
ఏడాదిన్నరగా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రజతోత్సవ సభలో చేసిన ప్రసంగం అద్భుతంగా ఉంది. కోట్లాదిమంది ప్రజలు ఆయన ప్రసంగాన్ని విన్నారు. తాను రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం చేసిన పనులను వివరించారు. అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలకు చేస్తున్న మోసాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగుచెందారు. మళ్లా కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు.
– దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే, బెల్లంపల్లి
చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 28: ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుంది. గడిచిన 20 ఏండ్లలో ఇలాంటి సభ ఎప్పుడూ జరుగలేదు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అద్భుతంగా ఉంటుంది. అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇంతటి సభను నిర్వహించలేదు. కానీ రజతోత్సవసభను ఎంతో ప్రణాళికతో నిర్వహించారు. మహాగర్జనను తలపించింది. కేసీఆర్ తన ప్రసంగంలో పదేళ్ల అధికారంలో ప్రజలకు చేసిన సేవలు, పనులను గుర్తుకు చేశారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి తెలియపరిచారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ర్టానికి వచ్చిన అవార్డులు, వృద్ధిరేటు, సంపద సృష్టి, తదితర అంశాలను ప్రజలకు చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్లవంటి పథకాలతో ప్రజలకు చేరువైన విషయాన్ని వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని పనులను కూడా చేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. కానీ, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి, ప్రజలను మోసం చేసిందని అందరికీ అర్థమయ్యేలా తన ప్రసంగం కొనసాగింది.
ఇచ్చిన హామీలతో పాటు పాలనలో ఫెయిల్ అయ్యారని, తద్వారా తెలంగాణ ప్రజానీకం అవస్థలు పడుతోందని బాధపడ్డారు. తాను సాధించిన తెలంగాణ ఇలా అవుతుందని అనుకోలేదని ఆవేదన చెందారు. బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చుడు, ప్రశ్నించేవారిపై కేసులు పెట్టుడు, అస్తవ్యస్థంగా పాలనను సాగించడంపట్ల కేసీఆర్ మండిపడ్డారు. ప్రజలంతా బీఆర్ఎస్నే కోరుకుంటున్నారని, రానున్న రోజుల్లో శ్రేణులు ప్రజల మధ్యే ఉంటూ, సమస్యల పరిష్కారం కోసం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు.
– నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే , మంచిర్యాల