హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామ పంచాయతీ పరిధిలోని బుద్ధిపల్లికి చెందిన తిర్రి నర్మద ఈ నెల 23వ తేదీన చెకప్ కోసం మంచిర్యాల మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి వచ్చారు. పరీక్షించిన వైద్యురాలు బీపీ ఎక్కువైందని అడ్మిట్ కావాలని చెప్పారు. ఒకరోజు ఆసుపత్రిలో ఉన్నాక బీపీ నార్మల్‌కి వచ్చింది. రేపు డెలివరీ చేస్తామని ఓ పేపర్ మీద ఇంజక్షన్ రాసి ఇచ్చారు. ఇదేం ఇంజక్షన్ ఒకసారి డాక్టర్‌ను కలవాలని నర్మద భర్త ప్రశాంత్ వైద్య సిబ్బందిని అడిగితే వారి నుంచి సమాధానం రాలేదు. నర్మద ఉన్న రూమ్ మొత్తం వాసన కొడుతుందని క్లీన్ చేయాలని కోరిన సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిపోయిన అతను భార్యను తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది నా ఇష్ట పూర్వకంగానే ఇంటికి వెళ్తున్నా నాకు, బిడ్డకు ఏం జరిగినా ఆసుపత్రికి సంబంధం లేదంటూ ఓ సంతకం చేయించుకుని పంపించారు. అలా 24వ తేదీనే డెలివరీ అవుతుందని చెప్పిన నర్మద మే 1వ తేదీన మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డెలివరీ అయ్యింది.
బెల్లంపల్లికి చెందిన మరో మహిళ మంగళవారం సాయంత్రం డెలివరీ కోసం మంచిర్యాల ఎంసీహెచ్‌కు వచ్చింది. మూడు రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చిన ఆమెకు నొప్పులు వచ్చాక ఆసుపత్రికి రండి అని వైద్యులు సూచించారు. ఆమెను సిబ్బంది కూడా పట్టించుకోలేదు. బెడ్ కూడా ఇవ్వలేదు. బుధవారం మధ్యాహ్నం వరకు ఎదురుచూసిన సదరు మహిళ తరఫున బంధువులు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. బయటికి వెళ్లే సమయంలో వచ్చిన వైద్యురాలు ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తున్నామని బాధితులు చెప్పాక అప్పుడు వైద్యురాలు తీసుకెళ్లి నార్మల్ డెలివరీ చేశారు.
మంచిర్యాల, మే 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల మాత, శిశు సంరక్షణ కేంద్రంలో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో వైద్య సిబ్బంది విఫలం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రిలో అడ్మిట్ చేశాక పేషెంట్ ఉన్న రూమ్‌లో వాసన వస్తుందని, రూమ్ బాగోలేదని క్లీన్ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది పట్టించుకోలేదని నర్మద భర్త చెప్తున్నారు. బీపీ కంట్రోల్లోకి వచ్చాక వైద్య సిబ్బంది ఒక ఇంజక్షన్ రాసి ఇచ్చి బయటకి వెళ్లి తెచ్చుకోమన్నారని… ఇది ఏం ఇంక్షన్ ఇలా స్లిప్పై రాసిస్తే ఎలా.. బయటికి వెళ్లి తెచ్చుకోవడం ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పలేదంటున్నారు. ఈ ఇంజక్షన్ ఎందుకని వైద్యురాలిని అడుగాలంటే సిబ్బంది కలవనియ్యలేదంటున్నారు. 23వ తేదీన ఎంసీహెచ్‌కు వెళ్లే 24వ తేదీ డెలివరీ చేస్తామన్నారని… అక్కడ నచ్చక ఇంటికి వెళ్లిపోతామంటే మా ఇష్టపూర్వకంగానే ఇంటికి వెళ్తున్నట్లు సంతకం చేసి పోవాలని చెప్పారన్నారు. తప్పని సరి పరిస్థితుల్లో నా భార్యతో సంతకం చేయించి ఇంటికి తీసుకెళ్లామని, వారం రోజులయ్యాక ఈ రోజు డెలివరీ అయ్యిందని ఆయన తెలిపారు. నొప్పులు రావడానికే నా భార్యకు ఇంజక్షన్ వేయాలని చూశారా..? అది ఏం ఇంజక్షన్.. స్లిప్పై ఎందుకు రాసిచ్చారు అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదని వాపోయారు. నా కంటే కొంచెం తెలుసు ఇంజక్షన్ దేని కోసమని నేను అడిగాను.. ఏం తెలియని అమాయకులు ఇంజక్షన్ తెచ్చి ఇచ్చాక అది వికటిస్తే వాళ్ల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించాలన్నారు. అదే ఆసుపత్రిని నీట్‌గా మెయింటేన్ చేస్తే డెలివరీ చేయించుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి కేసులు రోజుకు రెండు, మూడైనా ఎంసీహెచ్‌లో ఉంటాయని డెలివరీల కోసం వచ్చే బాధితులు చెప్తున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డిని వివరణ కోరగా.. ఎలాంటి ఇబ్బందులున్నా ఆసుపత్రి హెల్ప్‌డెస్క్‌లో చెప్పుకోవచ్చన్నారు. నార్మల్ డెలివరీలు చేయించుకోవడం ఇష్టం లేని కొందరు సిజేరియన్ కోసం బయటికి వెళ్తున్నారన్నారు. సిజేరియన్ మేం చేయమని చెప్తే ఇలా బయటికి వచ్చి విమర్శలు చేస్తారన్నారు.