కొమురం భీమ్ ఆసిఫాబాద్ : జిల్లాలోని పెంచికల్పేట్ మండలం ఎలుకపల్లి గ్రామానికి చెందిన దుబ్బల రాకేష్ ( Rakesh ), అతడి సోదరుడని మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. 2023లో నావిలో కానిస్టేబుల్( Navy constable) ఉద్యోగం సంపాదించి, 2025 ఫిబ్రవరి వరకు ముంబైలోని నావి శాఖలో విధులు నిర్వహించాడు. అనంతరం కేరళ రాష్ట్రం ఎర్నాకులానికి బదిలిపై వెళ్లాడు.
ఈనెల 6న రాకేష్ ముంబైలోని నావి కేంద్రానికి వెళ్లి, అక్కడి సెంట్రీ స్థలం నుంచి తన సొంత సోదరుడు ఉమేష్ సహకారంతో ఒక ఇన్సాస్(INSAS (ఆయుధం, 3 మ్యాగ్జిన్లు, 40 రౌండ్లు అక్రమంగా దొంగిలించి స్వగ్రామానికి చేరుకున్నారు. విచారణ చేపట్టిన ముంబై క్రైమ్ పోలీసులు ఆధారాలను సేకరించి, నిందితులు రాకేష్, ఉమేష్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆయుధం, 3 మ్యాగ్జిన్లు , 40 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ దేశ భద్రతకు సంబంధించిన ఆయుధాల దొంగతనం వంటి ఘటనలు అత్యంత తీవ్రమైన నేరాలని పేర్కొన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాజ భద్రత కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.