కౌటాల, మే 15 : మండలంలోని మొగఢ్దగఢ్ గ్రామంలోని ఎల్ములే జిత్రు అనే రైతుకు చెందిన ఎద్దు బుధవారం నాటు బాంబు( గోలీలు) పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. బుధవారం ఉదయం గ్రామ శివారులో మేత మేస్తుండగా అడవి పందుల కోసం అమర్చిన నాటు బాంబు పేలి ఎద్దు మూతి, నాలుక, దవడ భాగం పూర్తిగా రాలిపోయింది. దీంతో ఎద్దు తీవ్ర రక్త స్రావంతో ఇంటికి వచ్చింది.
ఎద్దును చూసి జిత్రు ఆవేదనకు గురయ్యాడు. గత మార్చిలో ముత్తంపేటలోని జాడి విలాస్‌కు చెందిన రైతు ఎద్దు, మరో రైతుకు చెందిన ఎద్దుకు కూడా ఇలాగే నాటు బాంబు పేలుళ్లలో గాయాలై మృతి చెందాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు, పోలీసులు స్పందించి వన్య ప్రాణుల కోసం నాటు బాంబులు అమర్చే వేటగాళ్లను పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.