నార్నూర్, నవంబర్ 30 : కేసీఆర్ కృషితో రాష్ట్రంలో చిన్న గ్రామాలు పంచాయతీలుగా మారాయి. దీంతో పల్లెల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సర్పంచ్, పాలకవర్గం పర్యవేక్షణ, కార్యదర్శి ప్రత్యేక దృష్టితో గ్రామాలు అభివృద్ధి బాట పడుతున్నాయి. అందుకు ఉదాహరణే చోర్గావ్. ఈ గ్రామంలో 2011లో 1,111 మంది జనాభా ఉండగా.. 745 మంది ఓటర్లున్నారు. సర్పంచ్‌గా ఆత్రం అనుసూయబాయి ఎన్నికయ్యారు. కార్యదర్శిగా లఖణ్ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు గ్రామాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ పంచాయతీకి ప్రతి నెలా రూ.1.12 లక్షల నిధులు వస్తాయి. ఈ నిధులతో పంచాయతీలో వివిధ వసతులు కల్పిస్తున్నారు. గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా 400 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. రూ.11 వేలతో పల్లె ప్ర కృతి వనం ఏర్పాటు చేశారు. 900 వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. అంతర్గత రోడ్ల సమస్యకు చెక్ పెట్టేందుకు రూ.20 లక్షలతో 500 మీటర్ల సీసీ రోడ్డు వేశారు.
రూ.13 లక్షలతో డ్రైనేజీలు నిర్మించారు. రూ.3.50 లక్షలతో గ్రావెల్ రోడ్డు వేశారు. రూ.1.30 లక్షలతో మూడు చేతిపంపులు ఏర్పాటు చేశారు. రూ.1.80 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్, రూ.35 వేలతో డంప్ యార్డు నిర్మించారు. రూ.9 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంక్ కొనుగోలు చేశారు. రూ.11 లక్షలతో శ్మశానవాటిక నిర్మించారు. ముగ్గురు పంచాయతీ కార్మికులను నియమించి ప్రతినెలా వారికి రూ.25,500 వేతనం చెల్లిస్తున్నారు. ఇలా పంచాయతీ నిధులను సద్వినియోగం చేసుకుంటూ జోరుగా అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామంలో పరిశుభ్రత చర్యలు చేపడుతున్నారు. చెత్త సేకరణపై ప్రజలను చైతన్యవంతం చేశారు. సేకరించిన చెత్త ద్వారా వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేసి హరితహారం మొక్కలకు వేస్తున్నారు. ఇప్పటి వరకు 45 మంది కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిపొందారు. కొత్త, పాతగా 91మంది ఆసరా పింఛన్ పొందుతున్నారు. రూ.5 లక్షలతో కమ్యూనిటీ షెడ్ నిర్మించారు. లక్షల రూపాయలతో మిషన్ భగీరథ నీటి ట్యాంకు, కుళాయిలను ఏర్పా టు చేశారు. ప్రతి ఇంటికీ శుద్ధజలం అందిస్తున్నారు. ఇలా అనేక విధాలుగా చోర్గావ్ పంచాయతీ అభివృద్ధి బాటలో నడుస్తున్నది. గ్రామం దినదినాభివృద్ధి చెందుతుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరింత అభివృద్ధి సాధిస్తాం..
ఈ గ్రామ పంచాయతీ మరింత అభివృద్ధి సాధించేలా నా వంతు కృషి చేస్తా. ప్రజలందరూ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు. ప్రభుత్వం అందించే ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేస్తున్నాం. ప్రజలు, పాలకవర్గం, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తున్నాం. గ్రామంలో ఏవి అత్యవసరమో గుర్తించి వాటికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం. విడుతల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
– ఆత్రం అనసూయబాయి, సర్పంచ్, చోర్గావ్
ప్రజలను చైతన్యవంతం చేశాం..
ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో దూసుకపోతున్నది. గ్రామానికి ఏది అవసరమో ప్రాధాన్యతా క్రమంలో చూసుకుంటున్నాం. గ్రామస్తులతో చర్చించి పనులు చేపడుతున్నాం. ప్రజలకు ప్రతి అంశంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చైతన్యవంతం చేశాం. దీంతో ప్రతి పని సులువుగా అవుతున్నది. జిల్లా, మండలశాఖ అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తాం.
– లఖణ్, పంచాయతీ కార్యదర్శి, చోర్గావ్
గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నాం..
గ్రామాభివృద్ధికి తమవంతుగా సహకరిస్తున్నాం. మా పంచాయతీలో గతంలో చాలా సమస్యలు ఉండేవి. ప్రస్తుతం దశల వారీగా పరిష్కారమవుతున్నాయి. మాకు ఏది ముందు అవసరమో గుర్తిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నారు. గతంలా సమస్యలు ఇప్పుడు లేవు. అభివృద్ధి పనులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గ్రామం దినదినాభివృద్ధి చెందుతుండడం ఆనందంగా ఉంది.
– పెందోర్ భీంరావ్, గ్రామస్తుడు, చోర్గావ్