ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 13 ః ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకోవడానికి ఆయా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో రావడంతో పరిసర ప్రాం తాలు కిక్కిరిసి పోయాయి. దర్శనం కోసం గంటల కొద్దీ బారులుతీరారు. దారిపొడువునా వెలిసిన దుకాణాలు, రంగుల రాట్నా లు, హోటళ్లు, తినుబండారాల షాప్స్ వద్ద సందడి కనిపించింది. ఎటు చూసినా భక్తులు జాతరకు తరలివస్తూ కనిపించారు.
నాగోబా ఆలయ ఆవరణలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో మండగాజిలింగ్ పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా నాగోబాతోపాటు సతీదేవతలకు భక్తులు వేసిన కానుకల(పావుడి డబ్బులు)ను పటేల్ కిత్త, కటోడ కిత్త, పర్ధాంజీ కిత్తలవారీగా డబ్బులను పంచుకున్నారు. అనంతరం ప్రసాదంతోపాటు కొబ్బరికాయలు, ప్రమిదలు, మట్టికుండలను మెస్రం వంశీయులతోపాటు వారి దగ్గరి బంధువులకు పంపిణీ చేశారు. మహాపూజలకు వాడిన మట్టి కుండలను కూడా 22 కితలకు చెందిన వారికి పంపిణీ చేశారు.
బేతాల్దేవతకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ కాగడాలను వెలిగించి, బేతాల్ పూజలను ప్రారంభించారు. బేతాల్దేవత పేరిట సంప్రదాయ పద్ధతిలో నేలపై తంబాకు వేసి అక్కడి నుంచి నాగోబాను మొక్కుకున్నారు. అనంతరం సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ గోవాడ్‌కు చేరుకున్నారు. గోవాడ్ పక్కన పటేల్ గది ఏర్పాటు చేసి, బేతాల్దేవత పూజలపై మెస్రం వంశీయులతోపాటు మహిళలకు వేర్వేరుగా పర్ధాంజీ మెస్రం దాదారావ్, నాగోబా పేన్ కొత్వాల్ మెస్రం తిరుపతి వివరించారు. గోవాడ్ ఎదుట మెస్రం వంశీయుల మహిళల ఆధ్వర్యంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ చేతి కర్రతోపాటు పెద్దల పాదాలను నీటితో కడిగారు. మహిళలు, మెస్రం వంశీయులు వేర్వేరుగా మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా బేతాల్ నృత్యాలు చేశారు. తరువాత మెస్రం వంశీయులు అక్కడి నుంచి నాగోబాను దర్శించుకొని నాగోబా పూజలతోపాటు సంప్రదాయ పూజలకు ముగింపు పలికారు. సాయంత్రం కేస్లాపూర్ నుంచి కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లతో ఉట్నూర్ మండలంలోని శ్యామ్‌పూర్ గ్రామంలోని భుడుందేవు జాతర పూజల కోసం బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్రావ్పటేల్, చిన్ను పటేల్, బాజీరావ్, లింబారావ్ పటేల్, కటోడ కోసు, కటోడ కోసేరావ్, కటోడ హనుమంత్‌రావ్, నాయిక్‌వాడి ధర్ము, పర్ధాంజీ మెస్రం దాదారావ్, నాగోబా పేన్ కొత్వాల్ తిరుపతి, మెస్రం వంశీయులు గణపతి, దేవ్‌రావ్, శేఖర్‌బాబు, రాము, గంగారాం పాల్గొన్నారు.