కిక్కిరిసిన ఆలయ పరిసర ప్రాంతాలు
దర్శనానికి గంటల తరబడి బారులు
ఇప్పటివరకు 4 లక్షల మందికిపైగా దర్శనం
అనధికారికంగా మరో మూడు రోజులు కొనసాగే చాన్స్
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 6 :ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర ఆదివారంతో ముగిసింది. వారం రోజులుగా కేస్లాపూర్ దారులు కిక్కిరిసి పోగా.. చివరి రోజైన ఆదివారం భక్తజన సంద్రమైంది. దేశవ్యా ప్తంగా ఉన్న మెస్రం వంశీయులు, గిరిజనులతోపాటు లక్షలాది మంది నాగోబాను దర్శించుకున్నారు. బండెనక బండికట్టి వందలాది బండ్లు నాగోబా సన్నిధికి చేరుకోగా.. సంస్కృతీ సంప్రదాయాలతో పూజలు చేశారు. దైవభక్తితో అడవిబిడ్డలు పులికించిపోగా.. మరో మూడు రోజులు జాతర అనధికారింగా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారంతో అధికారికంగా ముగిసింది. జనవరి 31 అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజతో జాతర ప్రారంభం కాగా.. ఇప్పటివరకు దాదాపు 4 లక్షలకుపైగా భక్తులు నాగోబాను దర్శించుకున్నట్లు ఆలయ ఈవో మహేశ్ తెలిపారు. అయినప్పటికీ అనధికారికంగా మరో మూడు రోజులు కొనసాగనుందని పేర్కొన్నారు. ముగింపు రోజైన ఆదివారం భక్తులు వేలాది మంది ఎడ్లబండ్లు, ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిశాయి. దర్శనానికి గంటల తరబడి బారులు తీరారు. తినుబండారాల దుకాణాలు, హోటళ్ల వద్ద కొనుగోలుదారులతో సందడి నెలకొంది. రంగుల రాట్నం యువతీయువకులతోపాటు చిన్నపిల్లలు, మహిళలతో కోలాహలంగా మారింది. కాగా, నాగోబాను జగిత్యాల జిల్లా కలెక్టర్ రవినాయక్ సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.