మంచిర్యాలటౌన్, మార్చి 14 : మంచిర్యాల పట్టణంలోని రంగంపేట శివారులో వెలిసిన ‘శ్రీరంగం హిల్ సిటీ’లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని మున్సిపల్ అధికారులు సబ్రిజిస్ట్రారుకు గురువారం లేఖ రాశారు. కమిషనర్ మారుతీప్రసాద్ ఆదేశాల మేరకు టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ సతీశ్ ఇందుకు సంబంధించిన లేఖను స్వయంగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి అందజేశారు. గత నెల 23న ‘నమస్తే తెలంగాణ’లో ‘అక్రమాల శ్రీరంగం’ పేరిట కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన మున్సిపల్ అధికారులు రంగంపేటలోని మంచిర్యాల శివారు 58, 68, 69 సర్వే నంబర్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయవద్దని పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్‌ను ఏర్పాటుచేశారని, ఇందుకు సంబంధించిన వార్తా కథనాలు పత్రికలో వచ్చాయని, లేఅవుట్ అనుమతులు లేకుండా చేసిన ఈ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయవద్దని కోరారు.